అమరావతి :
మండలిలో వైఎస్సార్సీపీ ఈ రోజు కూడా తిరుపతి లడ్డూ ప్రసాద అంశం, హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డెయిరీ, టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంపై సభలో చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. వైసీపీ ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, తూమాటి మాధవరావు, మంగమ్మలు, బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఇచ్చిన ఈ తీర్మానాలను ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో వారు ఛైర్మన్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. వేంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్లకార్డులు పట్టుకుని పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. శాసనమండలికి ర్యాలీ వచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు.. భోలే బాబా.. చంద్రబాబా.. చంద్రబాబా.. ఆలీబాబా అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు.
ఇందాపూర్, హెరిటేజ్ లింకులపై చర్చించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. శ్రీవారి లడ్డూపై చంద్రబాబు నిందలు మోపారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. దేవదేవుడి ధనాన్ని లూటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బాబు ప్రభుత్వం పెట్టిన డొల్ల బడ్జెట్పై చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula Keshav) ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి ఫొటోలతో రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వేంకటేశ్వర స్వామి ఫొటోలతో నిరసన తెలపడంపై అభ్యంతరం తెలిపిన ఆయన.. దేవుడి ఫొటోలను పట్టుకుని నిరసనకు దిగడం అనైతికమన్నారు. సభలో దేవుడి చిత్రాలను అనుమతించవద్దని మంత్రి కోరారు.