* దేశంలో ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నారు..
* ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగించే విధానాలను పునఃసమీక్షించుకోవాలన్న సుప్రీం ..
* తమిళనాడు ఉచిత విద్యుత్ విజ్ఞప్తిపై స్పందిస్తూ కేంద్రం, సీజేఐ ధర్మాసనం నోటీసు జారీ...
ఢిల్లీ :
దేశంలో వివిధ రాష్ట్రాలలో అమలు చేస్తున్న ఉచితాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగించే విధానాలను పునఃసమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. దేశంలో మనం ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నామంటూ ప్రశ్నించింది.
తమిళనాడు ఎన్నికల వేళ అధికార డీఎంకే అందరికి ఉచిత విద్యుత్ ప్రతిపాదన చేసింది. వినియోగదారుల ఆర్థిక స్థితితో పట్టింపు లేకుండా అందరికీ ఉచిత విద్యుత్‌ను అందించాలని తమిళనాడు విద్యుత్ పంపిణీ కార్పొరేషన్ లిమిటెడ్ భావిస్తోంది. ఇందుకోసం విద్యుత్ సవరణ నియమాలు 2024లోని రూల్ 23ని సవాలు చేస్తూ తమిళనాడు విద్యుత్ పంపిణీ కంపెనీ లిమిటెడ్ రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ రిట్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజేఐ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు ముందు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు 'ఉచితాలను' ప్రకటించే ధోరణిని ధర్మాసనం మౌఖికంగా ఖండించింది. రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న ఉచితాల సంస్కృతిని తప్పు పడుతూ తీవ్రంగా విమర్శించింది. ఇది ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని పేర్కొంది.

దేశంలోని చాలా రాష్ట్రాలు రెవెన్యూ లోటులో ఉన్నప్పటికీ అభివృద్ధిని పట్టించుకోకుండా అలాంటి ఉచితాలను అందిస్తున్నాయని సీజేఐ ధర్మాసనం ప్రస్తావించింది. అందరికీ ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్‌ను ఇవ్వడానికి బదులుగా ఉపాధి కోసం మార్గాలను తెరవడానికి రాష్ట్రాలు కృషి చేయాలంటూ ధర్మాసనం పేర్కొంది. అలా కాకుండా ఇలాంటి ఉచితాలు పంపిణీ చేస్తే... ఎవరు పనిచేస్తారని ప్రశ్నించింది.
దేశంలోని చాలా రాష్ట్రాలు ఆదాయ లోటులో ఉన్నాయని.. అయినా రాష్ట్రాల ప్రభుత్వాలు అభివృద్ధిని పట్టించుకోకుండా ఇలాంటి ఉచితాలను అందిస్తున్నాయంది. భారతదేశంలో మనం ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నాము? విద్యుత్ ఛార్జీలు చెల్లించలేని వారికి సంక్షేమ చర్యలో భాగంగా మీరు అందించాలనుకుంటున్నారంటే దానిని అర్థం చేసుకోవచ్చు. కానీ విద్యుత్ బిల్లులు భరించగల వారికి, భరించలేని వారికి మధ్య తేడాను గుర్తించకుండా మీరు అమలు చేయడం ఎంతవరకు సమంజసం? అంటూ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు.
అయితే, ఉచిత విద్యుత్ అందించాలనే తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థ విజ్ఞప్తిపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం, ఇతరులకు సీజేఐ ధర్మాసనం నోటీసు జారీ చేసింది. మరి ఎన్నికలోస్తే చాలు ఉచితాలపై హామీల మీద హామీలు గుప్పించి ఓట్లు కోసం తాపత్రేయపడే పార్టీలకు ఈ హెచ్చరిక ఓ గుణపాఠంగా భావించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతొంది.