- పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకొని...
* పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే వారే సభ్యత్వం తీసుకోండి...
* పార్టీ సభ్యత్వం తీసుకునే వారిని ఉద్యమిగా పిలవాలని నిర్ణయం...
* 2 కోట్లు విరాళం అందించి సభ్యత్వం తీసుకున్న అధినేత పవన్ కళ్యాణ్
మంగళగిరి :
జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకొని... పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే వారే పార్టీ సభ్యత్వం తీసుకోవాలని సూచించింది. పార్టీలో సభ్యత్వం తీసుకుని పనిచేసే వారికి కూడా మూడు కొత్త రకాల పేర్లతో పిలవాలని నిర్ణయించింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో భాగంగా రూ.2 కోట్ల రూపాయాలు చెల్లించి అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో పనిచేసే వారికి కొత్త పేర్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్.. ఉద్యమి, సాధక్, ప్రదాత అంటూ మూడు పేర్లను ప్రకటించారు. అనంతరం కార్యకర్తలను, శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. జనసేన పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకొని, పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ముందుకొచ్చి పార్టీ సభ్యత్వం తీసుకునేవారిని ఉద్యమిగా పిలవాలని నిర్ణయించారు.

అలాగే జనసేన పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందిస్తూ, యువతలో ప్రేరణ కలిగించి పార్టీ పట్ల ఆకర్షితులను చేసి సభ్యత్వ నమోదు చేసేవారిని సాధక్ గా పిలవాలని నిర్ణయించారు. ఇక జనసేన పార్టీ చేస్తున్న ప్రజా, రాజకీయ పోరాటానికి పరోక్షంగా ఆర్థిక, సాంకేతిక, సేవా, మేథా సహాయ సహకారాలు అందించేవారిని ప్రదాతలుగా పిలుస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీని 150 మందితో ప్రారంభించామని.. 2021లో సభ్యత్వాలు ప్రారంభించినప్పుడు 90 వేల మంది సభ్యత్వం తీసుకున్నారన్నారు.

ఎన్నికలకు ముందు - తరువాత :
2021 తరువత 2024 ఎన్నికల ముందు చేపట్టిన సభ్యత్వ నమదు నాటికి జనసేనలో సభ్యుల సంఖ్య ఆరు లక్షలకు చేరిందని.. ఎన్నికల తర్వాత 12.98 లక్షల సభ్యత్వాలు సాధించినట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. చిరు వ్యాపారులు, కూలీపనులు చేసుకునేవారు, విద్యావంతులు ఇలా ఎంతో మంది ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారని అన్నారు. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకొని, పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే జనసేనకు ముఖ్యమని.. అలాంటి వారే పార్టీకి అవసరమని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.
