కడప :
ఎపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
3,32,205 కోట్ల అంచనా వ్యయంతో శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో కడప జిల్లాపై కక్ష, రాయలసీమ పై వివక్షత కొట్టొచ్చినట్లు కనపడుతోందని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఒక ప్రకటనలో విమర్శించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రవేశ పెట్టిన బడ్జెట్లో వ్యవసాయం, నీటిపారుదల, విద్య, వైద్యం, ఎస్సీ-ఎస్టీ-బీసీ సంక్షేమ రంగాల్లో సముచిత ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రాంతీయ అసమానతలను మరింతగా పెంచే విధంగా నిధుల కేటాయింపులు చేసింది అని పేర్కొన్నారు.
వ్యవసాయం – రైతుల పట్ల నిర్లక్ష్యం :
వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయినప్పటికీ, రైతుల ఆదాయం పెంపు, పంటల ధరల స్థిరీకరణ, సాగునీటి భరోసా వంటి అంశాల్లో స్పష్టమైన దిశా నిర్దేశం కనిపించలేదని అన్నారు. అన్నదాత పథకాల పేరుతో ప్రకటనలు ఉన్నప్పటికీ, రైతు సమస్యల మూల కారణాల పరిష్కారంపై చర్యలు లేవని విమర్శించారు.
నీటిపారుదల – రాయలసీమకు గండి :
రాయలసీమలో కీలక ప్రాజెక్ట్ అయిన గాలేరు నగరి సుజుల స్రవంతి రెండో దశ పనులు పూర్తికి తగిన నిధులు కేటాయించకపోవడం తీవ్ర అన్యాయం అని పేర్కొన్నారు. అలాగే, రాయలసీమ భవిష్యత్తుకు కీలకమైన రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు కూడా బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించకపోవడం ప్రభుత్వం ప్రాంతీయ అసమానతలపై ఎలాంటి చిత్తశుద్ధి లేదనే విషయాన్ని రుజువు చేస్తోందని అన్నారు.
“ఏపీ అంటే అమరావతి – పోలవరం” అంతేనా : “ఏపీ అంటే అమరావతి – పోలవరం”అన్న విధంగా నిధుల కేటాయింపులు చేసి, రాయలసీమను పక్కన పెట్టడం దురదృష్టకరం అని విమర్శించారు. ముఖ్యంగా Polavaram Irrigation Project కు పెద్ద మొత్తంలో కేటాయింపులు ఉండగా, రాయలసీమ ప్రాజెక్టులకు నిర్లక్ష్యం చూపడం అన్యాయమన్నారు.
విద్య – వైద్యం రంగాల్లో అసమాన ప్రాధాన్యత :
విద్య, వైద్యం రంగాలకు కేటాయింపులు ఉన్నప్పటికీ, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ ఆసుపత్రుల బలోపేతంపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక కనిపించడంలేదని పేర్కొన్నారు.
సంక్షేమంలో గణాంకాల మాయాజాలం :
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమానికి కేటాయింపులు పెరిగినట్లు చూపించినా, వాటి వినియోగం మరియు లక్ష్యిత వర్గాలకు చేరే విధానంపై సందేహాలు ఉన్నాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం – కేవలం గణాంకాల మాయాజాలం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు వేరే రంగాలకు మళ్లించే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈ బడ్జెట్‌లో కూడా నిజమైన సామాజిక న్యాయం కనిపించడం లేదని గాలి చంద్ర పేర్కొన్నారు. బీసీ కార్పొరేషన్లకు భారీ కేటాయింపులు ప్రకటించినా, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనపై స్పష్టత లేదని విమర్శించారు.
ఉక్కుపై లేని స్పష్టత :
కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయమై ఎలాంటి స్పష్టత లేకపోవడం..కడప బెంగళూరు రైల్వే నిర్మాణంపై నిధుల ప్రస్తావన లేకపోవడం.ఈ రెండు అంశాల్లో కూడా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నాయని సిపిఐ విమర్శించింది. ప్రాంతీయ అసమానతలకు ఆజ్యం అమరావతి, కొన్ని ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధిపై అధిక దృష్టి పెట్టి, రాయలసీమ, ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం రాష్ట్ర ఐక్యతకు హానికరమని గాలి చంద్ర హెచ్చరించారు