బిజేపి :
రాజకీయ హాట్ రామెంట్స్ కు కేరఫ్ అడ్రసైన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మరోమారు హాట్ కామెంట్స్ చేశారు. ఆదినారాయణ రెడ్డి అంటే రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారికి ఎవరికైనా తెలిసిన విషయమే. హాట్ కామెంట్స్ చేయడంతో ముందుంటారు. తాజాగా ఆదివారం తిరుపతిలో నిర్వహించిన బీజేపీ సమావేశంలో ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మీద సంచలన కామెంట్స్ చేశారు. సొంత పార్టీ మీద ఆయన మాట్లాడుతూ కూటమి ఏలుబడిలో అంతా కమ్మ కమ్మగా ఉందంటూ ఆదినారాయణ రెడ్డి మాట్లాడటం విశేషం.
అప్పట్లో పత్రికా ప్రముఖుడు గజ్జల మల్లారెడ్డి 1983లో ఎన్టీఆర్ పాలన గురించి మాట్లాడుతూ కమ్మగా ఉందని చెప్పేవారని, ఇపుడు ఏపీలో కూటమి పాలన అంతకంటే కమ్మ కమ్మగా ఉందని ఆదినారాయణరెడ్డి పోల్చి చెప్పడం మరో విశేషం. కమ్మగా ఉందంటే మీ అందరికీ అర్థమైంది కదా అంటూ ఆదినారాయణ రెడ్డి పార్టీ క్యాడర్ కి రెట్టించి మరీ అడగడం చర్చనీయాంఘంగా మారింది. అంతేకాదు కూటమి పాలనలో కమ్మతనం పోవాలని ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. కమ్మతో పాటు అన్ని కుల్లాలు ఉన్నాయని గుర్తించాలని, పనిచేసే వారికే పదవులు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. అందరికీ న్యాయం చేయాలని కూడా ఆయన గట్టిగా కోరారు.
బీజేపీ లేకపోతే టిడిపి లేదు, జనసేన లేదు.... :
కమ్మ గురించి చెబుతూనే బీజేపీ గురించి కూడా చెప్పుకొచ్చారు. ఏపీ రాజకీయాల్లో బీజేపీ చాలా ప్రధానమైనదని ఆదినారాయణ రెడ్డి చెప్పడం విశేషం. బీజేపీ లేకపోతే టీడీపీ జనసేన లేనే లేవన్నారు. అంటే బీజేపీ కేంద్రంలో ఉంటూ తన బలాన్ని ఏపీకి అందిస్తోందని, కానీ ఇక్కడ మాత్రం బిజేపికి అందాల్సిన ప్రధాన్యత దక్కలేదన్నది ఆయన చెప్పదలచారా అన్నది ముఖ్యమైన అంశం. అంతే కాదు బీజేపీకి ఏపీ రాజకీయాల్లో రావాల్సినంత గుర్తింపు కానీ ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత కానీ ఇవ్వడం లేదని కూడా ఆదినారాయణ రెడ్డి భావనగా ఉంది అని అంటున్నారు.
" ఆది " అంత అసంతృప్తిగా ఉన్నారా ? :
ఏపీలో పదవుల విషయంలో బీజేపీకి అన్యాయం జరుగుతోంది ఇది వరకు బిజేపి ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కూడా ప్రస్తావించారు. ఇపుడు అదే పార్టీకి చెందిన ఆదినారాయణ రెడ్డి సైతం అంటున్నారు. అందుకే ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హాజరైన సమావేశంలో మాట్లాడుతూ ఈ రకంగా బీజేపీకి పదవులు అంటూ గుర్తు చేసేందుకు మాట్లాడారా అన్నది చర్చ. అదే సమయంలో బీజేపీ లేకపోతే కూటమి లేదు, ఎవరూ లేరు అన్నట్లుగా ఒక సందేశాన్ని పంపించారు. ఇక కూటమిలోని మిత్రులుగా ఉన్న జనసేనలో పదవుల విషయంలో ఆవేదన ఉందని అంటున్నారు. బీజేపీ కూడా ఇదే విషయం మీద మధన పడుతోంది అంటే కూటమి పెద్దలు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఆదినారాయణ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు ఎపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.