కడప :
జనగణనలో సమగ్రంగా కులగనన చేపట్టి జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని, రాజకీయ సామాజిక ఆర్థిక సమానత్వం కోసం క్రియాశీలక పోరాటాలకు బీసీలందరు సన్నద్ధం కావాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య పిలుపునిచ్చారు . ఆదివారం స్థానిక బీసీ భవన్ లో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అధ్యక్షతన జరిగిన సదస్సులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, కడప మాజీ మేయర్ కే సురేష్ బాబులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మన రాష్ట్రంలో దాదాపు 143 వెనుకబడిన కులాలున్నాయని, గత స్థానిక సంస్థలలో బిసిలకు కేటాయించిన స్థానాలు తగ్గించడం వలన వేల సంఖ్యలో స్థానిక సంస్థలకు చెందిన పదవులను బిసిలు కోల్పోయారన్నారు. తెలంగాణాలో ప్రభుత్వం జనాభా లెక్కల సందర్భంగా కులగణన చేపట్టి, అందుకనుగుణంగా ఎస్సి, ఎస్టి, బిసి వర్గాలకు స్థానిక సంస్థలలో సీట్లు కేటాయిస్తూ అసెంబ్లీలో రెండు బిల్లులు ఆమోదించిందన్నారు. అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా జనగణనలో కులగణన చేపట్టి, కులాల ప్రాతిపదికన బిసిలకు స్థానిక సంస్థలలో సీట్లు కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేస్తుందన్నారు. “పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం, హోదాల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వం" ఇవి భారత రాజ్యాంగంలో మొదటి పేజీలో మనకు మనం రాసుకున్న మూల సూత్రాలన్నారు. ఈ మహోన్నత లక్ష్యాలతో ఒక న్యాయపూర్వక సమాజాన్ని నిర్మించాలని సంకల్పించి 76 సంవత్సరాలు కావస్తున్నా ఈ లక్ష్య సాధనకు అవసరమైన సమగ్ర కులగణన ఇప్పటికీ జరగలేదంటే ఎవరు ఎంత వెనుకబడి ఉన్నారు? ఎవరికి ఎంత అన్యాయం జరుగుతోంది? మన రాజ్యాంగ లక్ష్యాలు ఎంత దూరంలో ఉన్నాయి? ప్రశ్నలకు సమాధానాలు మనకు డేటా లేకపోవడం వలన తెలియడంలేదన్నారు. కులాల వారీగా సామాజిక-ఆర్థిక స్థితిగతులు, సంపద పంపిణీ, అవకాశాల అసమానతలు స్పష్టంగా తెలియకుండా పోయాయని, ఫలితంగా వెనుకబడిన వర్గాల (బిసి) జాబితాలో ఉన్న కులాలు రాజకీయ శక్తి, విద్య, ఉద్యోగాలు మరియు ఆర్థిక వనరులలో తమకు రావాల్సిన హక్కులను కోల్పోతున్నాయని చెప్పారు. కులగణన జరగకపోవడంవల్ల ఏర్పడుతున్న నష్టాలు అపారమైనవి కులగణనను కేవలం జనాభా లెక్కలకు పరిమితం చేయకుండా, కులాల వారీగా ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులు, సంపద పంపిణీ , అవకాశాల సమానత్వాన్ని తెలుసుకునే విధంగా సమగ్రంగా జరిపించాలని డిమాండ్ చేశారు. కులగణన జరగడం వల్ల లభించే ప్రయోజనాలు అణగారిన వర్గాలకు రావాల్సిన రిజర్వేషన్లు, సామాజిక కార్యక్రమాలు మరింత లక్ష్యబద్ధంగా అమలు చేయవచ్చునన్నారు. కుల వ్యవస్థ ద్వారా ఏర్పడుతున్న అడ్డంకులను గుర్తించి పరిష్కరించవచ్చునని, దాగివున్న కఠిన వాస్తవాలను సమాజం ముందు పెట్టవచ్చునని చెప్పారు. జనగణనలో కుల గణన చేపట్టాలనేది దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారన్నారని, దేశంలో 50 శాతానికి పైగా బీసీలు ఉన్నారన్నది జగమెరిగిన సత్యమని, కానీ ఖచ్చితమైన లెక్కలు ప్రభుత్వం తేల్చాలని ఆ ప్రాతిపదికన చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కులగణనలో సామాజిక, ఆర్థిక ,రాజకీయ స్థితిగతులు సమగ్రంగా జనగణన జరపాలని అందుకు అనుగుణంగా చట్టసభలలో స్థానిక సంస్థలలో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని అందుకోసం సిపిఐ క్రియాశీలక పోరాటాలకు సన్నద్ధమవుతుందని చెప్పారు .
వెనుకబడిన తరగతులు ఎల్లప్పుడూ వెనుకబడే ఉంటున్నారని ఆవేదం వ్యక్తం చేశారు. కులగనణలో జనగణన చేపడితే బీసీల సంఖ్య తేలుతుందని బీసీలలో సమాంతరమైన అవకాశాలు కల్పించేందుకు ఏబిసిడిలు గా వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు అన్నింటిలో కూడా అన్ని కులాలకు వర్గాలకు సమాన అవకాశాలు కలిగినప్పుడే దేశం సమగ్రంగా అభివృద్ధి చెందినట్లున్నారు. కులవృత్తులకు వృత్తికి సంబంధించిన చిన్న చిన్న పరికరాలు అందించి ఓట్లు దండుకుంటున్నారని ఇది వారి అభివృద్ధి సంక్షేమం కాదని ఆధునిక బానిసత్వం అన్నారు . ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాలలో పరుగులు పెడుతుంటే భారతదేశంలో కులాలకు కుల వృత్తులకు బీసీలను కట్టిపడేస్తున్నారన్నారు. ఓట్లు సీట్లు పొందుతున్న రాజకీయ పార్టీలు ఏవి కూడా బీసీల అభివృద్ధి గురించి మాట్లాడమని వారి రాజకీయ పార్టీల పదవులు కూడా బీసీలకు ఎవరని వారిని కులాల వారీగా విభాగాల వారీగా కట్టిపడేస్తున్నారన్నారు . అన్ని రాజకీయ పార్టీలు జన గణనలో కుల గణన జరిపించాలని తీర్మానం చేయించి అందుకు కావలసిన కార్యాచరణ తీసుకొచ్చే విధంగా ఆయా రాజకీయ పార్టీల బీసీలు నాయకులు ఒత్తిడి తీసుకురావాలన్నారు . కుల గణన లో జనగణన సమగ్రంగా సామాజిక ,ఆర్థిక , రాజకీయ రాజకీయ స్థితిలు నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో బిసి సంగం జిల్లా అధ్యక్షుడు లింగమూర్తి, మాజీ నాయిబ్రహ్మణ కార్పోరేషన్ చైర్మన్ యానాదయ్య, మాజీ కార్పొరేటర్ హరినారాయణ, సంగటి మనోహర్, డాక్టర్ మల్లెల భాస్కర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ వెంకట్ శివ, విజయలక్ష్మి, జి మద్దిలేటిలు పాల్గొన్నారు.