AP :
ఏపీలో ప్రస్తుతం తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంతో రాజకీయం ఆసక్తి కరంగా మారింది. ఈ లడ్డూ వివాదమే ఇప్పుడు రాజకీయ రచ్చగా మారింది. వైసీపీ నేతల ఇళ్లపై టీటీడీ కేడర్ దాడులతో ఆ పార్టీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేస్తున్నారు. లడ్డూ వివాదంలో తాజా ఆరోపణల పై సుప్రీంను ఆశ్రయించాలని వైసీపీ తాజాగా నిర్ణయించింది. ఇదే సమయంలో ... ఇటు స్థానిక సంస్థల ఎన్నికల దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. షెడ్యూల్ ప్రకారం నిర్వహించే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇదే సమయంలో ఈ ఎన్నికల వేళ వైసీపీ అనూహ్య నిర్ణయం దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ముందుగా గ్రామ పంచాయతీలకు, ఆపై పరిషత్ ఎన్నికలకు, చివరగా మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేలా కసరత్తు జరుగుతోందని సమాచారం. అయితే అటు కేంద్రం సెన్సెస్ ( జనాభా లెక్కల సేకరణ ) ను ప్రారంభిస్తున్న వేళ ఎన్నికల నిర్వ హణ కొనసాగుతుందా లేదా అనే సందేహం అధికార వర్గాల్లో వ్యక్తమవుతొంది. దీంతో ఈ విషయమై స్పష్టత కోరినట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోతే.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం కూడా భావిస్తోందని వినికిడి. ఏప్రిల్ నెలాఖరు లోగా ముందుగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించేలా కసరత్తు కొనసాగుతోంది. పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచిన తరువాత కూటమి పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల వైపు దృష్టి పెట్టాయని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నారు. దీంతో... అభ్యర్ధుల ఎంపికలో ముందస్తు వ్యూహాలను ఖరారు చేస్తున్నట్లు సమాచారం.
ఈ స్ధానికి సంస్థల ఎన్నికలు ఏప్రిల్ లో జరిగే అవకాశం ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైసీపీ ఆలోచనలు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి స్థానిక ఎన్నికల్లో వైసీపీ పోటీ చేస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావటం లేదు. ఎన్నికల్లో పోటీ చేయటమా లేక బహిష్కరించటమా అనే తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. అయితే, ఒకసారి ఎన్నికలను బహిష్కరిస్తే గ్రామస్థాయిలో క్యాడర్ పూర్తిగా నిస్తేజమైపోతుందని, అది పార్టీ భవిష్యత్ కు నష్టం చేస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అటు కేంద్రం సెన్సెస్ నిర్వహణ పైన ముహూర్తం ఫిక్స్ చేసింది. సెన్సెస్ పూర్తి కాకుండా ఎన్నికలు నిర్వహించటం కష్టమనే వాదన సైతం ఇప్పుడు అధికార వర్గాల్లో వినిపిస్తోంది. అందులో భాగంగానే ఈ నెల 20వ తేదీ లోగానే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. సెన్సెస్ దాదాపు ఏడాదికి పైగా కొనసాగే అవకాశం ఉంది. అటు స్థానిక సంస్థల ఎన్నికల పైన ఇప్పటికే సీఎం చంద్రబాబు పార్టీ కేడర్ ను సమాయత్తం కావాలని నిర్దేశించారు. ప్రభుత్వం పైన వ్యతిరేక ఉందని.. తమకు కలిసి వస్తుందని వైసీపీ అంచనాలు వేస్తోంది. దీంతో.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల పైన తీసుకునే నిర్ణయాలు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతున్నాయి. పోటీ చేస్తుందా లేదా అన్నది కొంత వేచి చూడాల్సిన పరిస్ధితి.