TRUMP HOT COMMENT :
చైనా పై అమెరికా మరోమారు సంచలన అరోపణలు చేసింది. న్యూ స్టార్ట్ ఒప్పందం ముగిసిన తర్వాత, చైనా 2020లో రహస్య అణు పరీక్షలు నిర్వహించిందని అమెరికా ఆరోపించింది. గల్వాన్ ఘర్షణ జరిగిన వారం రోజులకే ఈ పరీక్ష జరిగినట్లు అమెరికా పేర్కొంది. మరోవైపు, చైనా ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ అమెరికానే అణు ఆయుధ పోటీకి కారణమని విమర్శించింది. రష్యా- అమెరికా మధ్య జరిగిన అణు ఆయుధాల నియంత్రణ ఒప్పందం ‘న్యూ స్టార్ట్’ ముగిసిన తర్వాత.. అంటే 2020 జూన్ 22న చైనా రహస్యంగా అణు పరీక్ష నిర్వహించిందని అగ్రరాజ్యం తెలిపింది. అమెరికా చెబుతున్న ఈ తేదీ.. చైనాతో ఘర్షణలో లద్ధాఖ్‌లోని గల్వాన్ లోయలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన తేదీకి అతి సమీపంలో ఉండటం గమనార్హం.
చైనాపై అమెరికా ఆరోపణలు.. :
గల్వాన్ ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించగా, చైనా వైపు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వార్తలు వచ్చాయి. కానీ బీజింగ్ మాత్రం కేవలం నలుగురు సైనికుల మరణాన్ని మాత్రమే అధికారికంగా అంగీకరించింది. కాగా, జెనీవాలో తాజాగా జరిగిన నిరాయుధీకరణ సదస్సులో అమెరికా విదేశాంగ శాఖ అండర్ సెక్రటరీ థామస్ డినాన్నో మాట్లాడుతూ.. చైనా అణు పేలుడు పరీక్షలు నిర్వహించిందని, వందల టన్నుల సామర్థ్యం గల పరీక్షలకు సిద్ధమవుతోందని అమెరికా ప్రభుత్వానికి తెలుసని వెల్లడించారు. ఈ పరీక్షలు నిషేధ ఒప్పందాలను ఉల్లంఘిస్తాయని తెలిసే, చైనా సైన్యం భూకంప పర్యవేక్షణ వ్యవస్థలను తప్పుదోవ పట్టించే ‘డీకపుల్డ్’ పద్ధతిని ఉపయోగించిందని ఆయన ఆరోపించారు. జూన్ 15, 2020న గల్వాన్ ఘర్షణ జరిగిన సరిగ్గా వారం తర్వాత, అంటే జూన్ 22న చైనా ఒక అణు పరీక్షను నిర్వహించిందని డినాన్నో పేర్కొన్నారు.
న్యూ స్టార్ట్ ఒప్పందం.. :
2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. దీని ప్రకారం ఇరు దేశాలు తమ అణు వార్‌హెడ్‌లను 1,550కి, క్షిపణులను 700కి పరిమితం చేసుకోవాలి. 2026 నాటికి ఈ ఒప్పందం పరిమితులు అసంబద్ధంగా మారాయని డినాన్నో అన్నారు. చైనాకు చెందిన ఒక్క అణు ఆయుధం కూడా ఈ ఒప్పందం పరిధిలోకి రాదని ఆయన విమర్శించారు. రష్యా, చైనా తమ అణు సామర్థ్యాన్ని పెంచుకుంటున్న తరుణంలో, అమెరికా కూడా తన రక్షణను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అణు వ్యవహారంపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా స్పందిస్తూ.. రష్యా, చైనాలు తమ బాధ్యతల నుంచి తప్పుకుంటూ అణు బలగాలను విస్తరిస్తుంటే అమెరికా చూస్తూ ఊరుకోదని, ఆధునిక అణు నిరోధక శక్తిని కొనసాగిస్తామని చెప్పారు.
అమెరికానే అణు పరీక్షలు నిర్వహించిందంటున్న చైనా : ..
గల్వాన్ ఘర్షణ జరిగిన కొన్ని రోజులకే చైనా అణు పరీక్ష నిర్వహించిందని అమెరికా చేసిన ఆరోపణలపై ఆ దేశ రాయబారి షెన్ జియాన్ స్పందించారు. అమెరికా చేస్తున్నవి తప్పుడు ప్రచారాలని కొట్టిపారేశారు. ఆయుధ పోటీని పెంచుతున్నది అమెరికాయేనని విమర్శించారు. 2030 నాటికి చైనా వద్ద 1,000కి పైగా అణు వార్‌హెడ్‌లు ఉంటాయన్న అమెరికా అంచనాను ఆయన తోసిపుచ్చారు. తమ వద్ద ప్రస్తుతం సుమారు 600 వార్‌హెడ్‌లు మాత్రమే ఉన్నాయని, అమెరికా- రష్యా వద్ద ఒక్కొక్కరికి 4,000 చొప్పున ఉన్నాయని చైనా గుర్తుచేసింది.
అణు నియంత్రణ ఒప్పందంలో చైనాను కూడా చేర్చాలనే ట్రంప్ వ్యూహం ? :
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అణు నియంత్రణ ఒప్పందంలో చైనాను కూడా చేర్చాలని భావిస్తున్నారు. "ఒకవేళ మనం ఒప్పందం చేసుకోవాలనుకుంటే, అందులో చైనా కూడా సభ్యుడిగా ఉండాలి," అని ఆయన న్యూయార్క్ టైమ్స్‌తో అన్నారు. అయితే తమ అణు సామర్థ్యం అమెరికా, రష్యాల స్థాయిలో లేనందున ప్రస్తుతానికి ఇటువంటి చర్చల్లో పాల్గొనబోమని చైనా ఇప్పటికే స్పష్టం చేసింది.