తిరుమల లడ్డూ వివాదంపై ప్రభుత్వ వ్యాఖ్యలకు వైపీసీ కౌంటర్ ఇచ్చింది. తిరుమల నెయ్యి వ్యవహారంలో మరో కమిటీ ఏర్పాటు చేయడంపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్రంగా స్పందించారు. నెయ్యిలో జంతు కొవ్వు లేదని ఇప్పటికే NDDB నివేదిక స్పష్టంచేసిందన్నారు. అయినా మళ్లీ కొత్తగా కమిటీ ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. “జంతు కొవ్వు ఉందని చెప్పే నివేదిక వచ్చే వరకు కమిటీలు వేస్తూనే ఉంటారా?” అని విమర్శించారు. తిరుమల అంశాన్ని రాజకీయాల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ, ఈ విషయంపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని గుడివాడ అమర్‌నాథ్ డిమాండ్ చేశారు. లడ్డూలో జంతు కొవ్వు లేదని వచ్చిన నివేదికపై మీడియా ప్రశ్నలు అడిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు ఉందని చెప్పించేందుకు చంద్రబాబు కమిటీ వేశారా? లేక వైయస్ఆర్‌సీపీపై నెపం నెట్టేందుకు మరో కమిటీ ఏర్పాటు చేస్తున్నారా? అని అమరనాథ్ ప్రశ్నించారు.రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆయన ఆరోపించారు. గతంలో తాను నాస్తికుడినని ప్రకటించుకున్న నాగేంద్రబాబు, ఇప్పుడు సనాతన ధర్మం పేరుతో మాట్లాడడం ఎలా సాధ్యమవుతుందో ప్రజలు ఆలోచించాలని అన్నారు. నాగబాబు చేసిన ట్వీట్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయని గుర్తుచేశారు. కల్తీ లడ్డూ అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి ఎప్పటికప్పుడు మారుతుందని విమర్శించారు.
కాపులపై కూటమి ప్రభుత్వ వేధింపులు .... :
కాపు సామాజిక వర్గంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కక్ష్యతో వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ ఆరోపించారు. కాపు నేతలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాపు నాయకుడు వంగవీటి రంగాను హత్య చేయడం నుంచి ముద్రగడ పద్మనాభాన్ని అనేక విధాలుగా వేధించడం వరకు కాపు వర్గంపై దాడులు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు పై దాడి చేసి, ఆయనపై తప్పుడు కేసులు పెట్టడం కూడా అదే ధోరణి భాగమని అన్నారు.
రేపు కాపు నేతల చలో గుంటూరు :
అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు తాము రేపు ఉదయం వెళ్లనున్నట్లు అమరనాథ్ చెప్పారు. దాడులకు పాల్పడిన వారిని వదిలేసి, బాధితులపైనే తప్పుడు కేసులు నమోదు చేయడం దురదృష్టకరమన్నారు. అంబటి రాంబాబు పై నమోదు చేసిన కేసుల విషయంలో న్యాయపరంగా పోరాటం చేస్తామని చెప్పారు. తాము చేపడుతున్నది సంఘీభావ యాత్ర మాత్రమేనని, దీనికి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు.