రాయలసీమ జిల్లాల నీటి అవసారాలు ...
" రాయలసీమ ఎత్తిపోతల పథకం" ఆవశ్యకత ....
సీమలోని ప్రాజక్టులకు నీరందాలన్నా...
తాగు, సాగునీటి కష్టాలు తీరాలన్నా ....
నెల్లూరు, ప్రకాశం జిల్లాల అవసరాలు తీరాలన్నా....
రాయలసీమ ఎత్తిపోతల పథకం తప్పని సరి ....

Rayalaseema lift :
రాయలసీమ జిల్లాల శాశ్వత కరువు నివారణ చర్యల్లో శ్రీశైలం జలాశయం వెనకభాగంలో సంగమేశ్వర నుంచి రోజుకు మూడు టియంసిలు చొప్పున నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా పోతిరెడ్డిపాడు దిగువన నాలుగు కిలోమీటర్ల వద్ద శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో కలిపేందుకు 2020 మే నెల 5వ తేదీన 5829.15 కోట్ల అంచనా వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ వెడెల్పు సామర్థ్యం 80వేల క్యుసెక్కులకు పెంపు, జిఎన్ఎస్ఎస్ థ్రాన కాలువ, తెలుగుగంగ, నిప్పుల వాగు సామర్థ్యం పెంపు పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ నెం. 203 విడుదల చేసి అవరోదాలను అధికమించి 80 శాతం పనులు పూర్తి చేసింది.
ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ఎత్తిపోతల పథకం, సామర్థ్యం పెంపు పథకాలపై విడుదల చేసిన జి.ఓ నెం.203 పై తెలంగాణా రాష్ట్ర కె.సి.ఆర్ ప్రభుత్వం ఒక వైపు అభ్యంతరాలను తెలుపుతూ మరో వైపు ఎలాంటి కేటాయింపులు, అనుమతి లేని సుంకేసుల ఆనకట్ట వద్ద ఎత్తిపోతల పథకం, పులిచింతల ఎడమకాల్వ, భీమా నది తెలంగాణాలోకి ప్రవేశించే ప్రాంతంలో కృష్ణ మండలంలోని కుసుమర్తి గ్రామంవద్ద భీమా వరద కాల్వ నిర్మాణం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 20 టియంసిల సామర్ధ్యానికి పెంచాలని, నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ నుండి ఎత్తిపోతల జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల మధ్య కృష్ణా నదిపై అలంపూర్ వద్ద గుమ్మడం, గొందిమల్ల, వెలటూరు, పెద్దమరూరు గ్రామాల పరిధిలో మరో బ్యారేజి (జోగులాంబ) నిర్మించాలని తీర్మాణం చేసిన తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే శ్రీశైలం నీటిమట్టం 800 అడుగులవద్ద 23148 క్యుసెక్కులు (2టియంసిలు) కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 3500 క్యుసెక్కులు, దిండి ఎత్తిపోతల నుంచి 5787 క్యుసెక్కులు (ఆర టియంసి) 824 అడుగుల వద్ద శ్రీశైలం ఎడమ కాలువ (ఎస్.ఎల్.బి.సి) ద్వారా 6000 క్యుసెక్కుల చొప్పున నీటిని ఎడా పెడా ఎత్తిపోతల ద్వారా నీటిని తోడేసుకునే వెసులుబాటును కలిగి. ఇవే కాకుండా జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ద్వారా శ్రీశైలంలోకి నీరు రాకముందే నీటిని వాడుకుంటూ, ఎలాంటి అనుమతులు కేటాయింపులు లేని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 35250 కోట్ల అంచనా వ్యయంతో 90 టియంసిల సామర్థ్యంతో అడ్డగోలు నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఏ.పి అభ్యంతరాలను, గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరికలను, యాజమాన్యబోర్డు షరతులను లెక్కచుకుండా పూర్తి చేయబోతున్నది. ట్రిబ్యునల్ కేటాయింపులకు భిన్నంగా అనుమతి లేని ప్రాజక్టులను అడ్డగోలుగా చేపట్టి వాటికి నీటిని కేటాయించాలని, గత కేటాయింపులను పునః సమీక్ష చేయాలని వితండవాదం చేస్తూ ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నీటిలో వాడుకునే వెసులుబాటుపై ఆరోపణలు గుప్పిస్తూ నీటి వివాదాలను రాజకీయ వివాధాలుగా మార్చి రాజకీయ లబ్ది పొందేందుకు కరువు పీడిత రాయలసీమపై కక్ష్యగట్టి రాయలసీమ జీవనాడి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలని చూస్తున్నది.
ఒక సారి నీటి కేటాయింపులు చూస్తే :
బచావత్ ట్రిబ్యునల్ 1894-95 నుండి 1971-72 వరకు 77 సం.రాల నీటి వివరాల ఆధారంగా కృష్ణానదిలో 75శాతం నీటి లభ్యత ఆధారంగా 2130 టియంసిలు నికర జలాలు లెక్కగట్టి మహారాష్ట్రకు 585 టియంసిలు, కర్ణాటకకు 734 టియంసిలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టియంసిలు (తెలంగాణకు 299 టియంసిలు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కు ( 512 టియంసిలు) కేటాయిస్తూ 1976లో తీర్పునిచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ గడువు 2000 యేడాదితో ముగియడంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వినతి మేరకు కేంద్రప్రభుత్వం 2004లో యు.పి.ఏ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం నీటి లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల జోలికి పోకుండా, మిగులు జలాలలను కూడా లెక్కగట్టి 448 టియంసిలు ఉమ్మడి ఆంధ్రప్రదేశకు 190 టియంసిలు, మహారాష్ట్రకు 81 టియంసిలు, కర్ణాటకకు 177 టియంసిలు పంపిణీ చేస్తూ 2010లో తీర్పునిస్తూ మిగులు జలాలు వాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్కు ఉన్న వెసులుబాటును కాలరాస్తూ, మిగులు జలాలపై నిర్మిస్తున్న గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజక్టుల భవిష్యత్ ప్రశ్నార్ధకం చేస్తూ రాయలసీమకు మరణ శాసనం చేసింది. ట్రిబ్యునల్స్ రెండూ కూడా ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నీటిని ప్రాజక్టుల వారిగానే కేటాయించాయి. తప్ప రాష్ట్రాలకు గుండుగుత్తగా కేటాయించలేదు. అయితే ఆయా రాష్ట్రాల్లో ప్రాజక్టుల వారిగా కేటాయించిన నీటిని సర్దుబాటు చేసుకునే వెసులుబాటును ఆయా రాష్ట్రాలకు కల్పించాయి. ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీటిలో రాయలసీమలో ఉన్న శ్రీశైలం కుడి ప్రధాన కాలువకు 19 టియంసిలు, కె.సి కెనాల్ చివరి ఆయకట్టుకు 10 టియంసిలు, మద్రాసుకు మంచినీళ్ళకోసం 15 టియంసిలు, బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ అమలయితే తెలుగుగంగకు 25 టియంసిలు, వరద సమయంలో గాలేరు నగరికి 38 టియంసిలు, గాలేరు నగిరి రెండో దశ నుండి హంద్రీనీవా రెండో దశకు, సోమశిల, కండలేరు రిజర్వాయర్లకు నీటిని తరలించాలంటే ఏకైక మార్గమయిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరే దిక్కు. అయితే హెడ్ రెగ్యులేటర్కు నీళ్ళు అందాలంటే శ్రీశైలం కనీస నీటిమట్టం 854 అడుగులు అమలు చేయాలి. కానీ తెలంగాణా ప్రభుత్వం వచ్చిన నీటిని వచ్చినట్లు ఎత్తిపోతల పథకాల ద్వారా స్ట్రా పెట్టి లాగినట్లు తోడేయడమే కాకుండా, శ్రీశైలం ఎడమ విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటిని దిగువకు వదిలి నాగార్జున సాగర్ ద్వారా ఆయకట్టుకు తరలించుకుపోతుంటే ఏ చట్టాలు, బోర్డులు వారిని వారించలేకపోతున్నాయి. రాయలసీమకు హక్కు కలిగిన నీటిని త్రాగునీటికోసం వాడుకునే వెసులుబాటులేదు. సముద్రంపాలవుతున్న వేల టియంసిల నీటిలో కొంతబాగమయినా సీమకు తరలించే వెసులుబాటు లేదని సిద్ధేశ్వరం అలుగు కావాలని, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ సామర్థ్యం పెంచాలని ప్రజల నుండి వచ్చిన వత్తిడికి గత ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, సామర్థ్యం పెంపు వల్ల అటు తెలంగాణాకు గాని, ఇటు ఏ.పిలోని దిగువ ప్రాంత ఆయకట్టుకు గాని ఎలాంటి నష్టం లేకపోయినా రాజకీయ దురుద్దేశాలను నీటి వివాదాలకు జోడించి పాలక ప్రభుత్వాలు రాయలసీమ నోట్లో మట్టికొట్టాలని చూస్తున్నాయి. నీటి వివాదాలను పరిష్కరించాల్సిన కేంద్రంలో బిజెపి వివాదాలను జఠిలం చేస్తూ ఎగువ భద్రకు జాతీయ హెూదా, బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులపై పునఃసమీక్ష, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడుగడుగునా అడ్డుకుంటూ సీమకు తీరని అన్యాయం చేస్తున్నది.
ఆనాటి నుంచే రాయలసీమకు నష్టం :
1937లో శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కృష్ణా, తుంగభద్ర నదీ జలాల కేటాయింపులో రాయలసీమకు ప్రధమ ప్రాధాన్యత కాల గర్భంలో కలిసిపోయింది. 1951లో కేంద్రజలవనరుల సంఘంచేత ఆమోదించబడిన కృష్ణా పెన్నార్ ప్రాజక్టు అపోహలు, అనుమానాల మద్య అటకెక్కించబడ్డది. 1956లో ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుతో బళ్ళారిని, తుంగభద్ర డ్యాంను కోల్పోయాము. 1964లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుతో కర్నూలు రాజదానిని కోల్పోయాము, చంద్రబాబు గత పాలనలో ప్రాజక్టులకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల రాయలసీమ ప్రాజక్టులు నికర జలాలను కోల్పోవలసి వచ్చింది. 1863లో ప్రారంభించి 1870లో పూర్తి చేయబడిన 150 సం.రాల చరిత్ర కలిగిన కృష్ణానీటిలో 39.9 టియంసిల నికర జలాలు కలిగిన కె.సి (కర్నూలు - కడప) కెనాల్ చివరి ఆయకట్టుకు నీరందక ప్రతి ఏటా రైతాంగం రోడ్డెక్కాల్సిన దుస్థితి. కర్నూలు జిల్లాలో కేసీ కెనాల్ అయకట్టు కోసం నిర్మించాలనుకున్న గుండ్రేవుల ప్రాజెక్టు మాటల్లోనే ఉంది తప్పా... నేటికి ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అంతేకాకుండా కడప జిల్లాలో 2.9 టియంసిల సామర్థ్యంతో రాజోలి రిజర్వాయర్, 1.0 టియంసిల సామర్థ్యంతో జొలదరాశి నిర్మాణానికి భూసేకరణ దశలో ఉన్నాయి. 1988 నవంబరు 19న శంఖుస్థాపన చేయబడిన గాలేరు నగరి సుజల స్రవంతి 16 సం.రాలు నిర్లక్ష్యం చేయబడి, 2004 నుండి రెండు దశలుగా విభజించబడి 8466.36 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించి గోరకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, చిత్రావతి ఎత్తిపోతల పథకాలు, వామికొండ, సర్వరాయసాగర్ నీటిని చూడగలుగుతున్నాము. పంటకాలువల నిర్మాణం, రెండో దశ పనులు, నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసం పూర్తికాలేదు. 1989లో శంఖుస్థాపన చేయబడి పాలకుల నిర్లక్ష్యానికి గురై 2004లో పనులు చేపట్టబడిన హంద్రీనీవా సుజల స్రవంతి చివరి ఆయకట్టుకు గాలేరు-నగిరి రెండో దశ నుండి నీటిని తరలించే పనులు నిర్మాణదశలో ఉన్నాయి. 1983 ఏప్రిల్ 27న శంఖుస్థాపన చేయబడిన తెలుగుగంగలో అంతర్భాగమయిన బ్రహ్మం సాగర్ ప్రారంభించిన సంవత్సరంలో 13 టియంసిలు నింపడం మినహా, వెలుగోడు నుండి ఎస్. ఆర్ 1 (సబ్ రిజర్వాయర్) వరకూ కాల్వల లైనింగ్ పూర్తిగా దెబ్బతిని పూర్తిస్థాయిలో నీళ్ళు రాక చివరికి చివరి ఆయకట్టు రైతాంగం త్రాగునీటికి ఇబ్బంది పడుతున్నది. ఈ నేపధ్యంలో వేసవి ఆరంభంలోనే భూగర్భజలాలు గణనీయంగా పడిపోయి గుక్కెడు మంచినీరు దొరకక గొంతెండిపోతున్నాయి.

రాయలసీమ ఎత్తిపోల పథకం ప్రాధాన్యత :
ప్రతి సంవత్సరం శ్రీశైలానికి 30 నుంచి 40 రోజులు వరద వస్తుంది. ఈ నీటిని రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు వినియోగించగలిగితే ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుంది. శ్రీశైలం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు, కనీసం 854 అడుగులు. ఈ నీటిని అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ల మధ్య పంపకం జరిగింది. అయితే వరద కాలంలో వచ్చే నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరి నిర్మాణం జరిగింది. శ్రీశైలం ప్రాజెకులో 841 అడుగుల నీటి మట్టం వద్ద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు తోడుకుంటామని అప్పటి సిఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై టిఆర్‌ఎస్ నాయకులు అనేక అభ్యంతరాలు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సామర్థాన్ని పెంచడంతో పాటు, పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకం చేపట్టింది. వీటివల్ల శ్రీశైలం ప్రాజెక్టులోకి రావలసిన నీరు తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో వరద నీటి వినియోగం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా ముందుకు వచ్చింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరి దిగువన కుడి కాలువలోకి రోజుకు మూడు టింఎంసీల నీటిని ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2020 మే 5న అనుమతి ఇచ్చింది. దీని అంచనా వ్యయం రూ.3,825 కోట్లు. అయితే ఈ పథకంపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు అయ్యింది. వెంటనే పనులు నిలిపివేయాలని ఎన్జీటి ఆదేశించింది. అయినా నాటి వైసిపి ప్రభుత్వం చెన్నై తెలుగుగంగ, రాయలసీమ త్రాగునీటి అవసరాల పేరుతో పనులు చేపట్టాలని 2023 ఆగస్టు 11న నిర్ణయించి సుమారు రూ.999 కోట్లు ఖర్చుచేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం ఈ పథకం గురించి పట్టించుకోలేదు. రాయలసీమ పథకాన్ని నేనే నిలిపివేయించానని రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనతో మరల ఇది చర్చనీయాంశమైంది.
ఎత్తిపోతల పథకం చుట్టూ ... రాజకీయ ఉచ్చు .... :
ఓ రకంగా చెప్పాలంటే రాయలసీమ తాగు, సాగు నీటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం లాంటి పథకాన్ని సాధించుకోవడం ఎంతైన అవసరం. కానీ ఇలాంటి పథకాల చుట్టూ రాజకీయ ఉచ్చు బిగుసుకోవడం, కాంట్రాక్టర్ల కోసం రూపొందించిన ప్రాజెక్టుల పేరుతో కాలయాపన చెయ్యడం ఈ ప్రాంతానికి తీరని నష్టం కలగజేసేదిలా ఉందన్నది సత్యం. రాష్ర్టంలో ప్రస్తుతం అధికారంలో కూటమి ప్రభుత్వం 80 శాతం పనులు పూర్తైన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కాదని పోలవరం -బనకచర్ల ఎత్తిపోతల పేరుతో కొత్త పథకాన్ని తెరపైకి తేవడంపై అందరు మండిపడుతున్నా.... సీమ ఎత్తిపోతల పథకంపై మాట కూడా మాట్లాడటం లేదు. రాయలసీమకు మేము ఎదో చేస్తున్నామంటూ చెప్పకోవడం ద్వారా రాజకీయ అరాటం తప్పా... కొద్ది కాలంలోనే అందుబాటులోకి వచ్చే రాయలసీమ ఎత్తిపోతల లాంటి పథకాన్ని వదిలి తరాలు పట్టే భారీ ఖర్చుతో కూడుకున్న పోలవరం -బనకచర్ల ఎత్తిపోతల పథకాన్ని రుద్దాలని చూస్తొంది. ఈ నేపధ్యంలో వైసీపీతో పాటు సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని వామపక్షాలు, సాగునీటి ఉద్యమ సంఘాలు కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఉద్యమించేందుకు సిద్దమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా నాయకులు, రైతులతో ఛలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే అధికార తెలుగుదేశం పార్టీ ఎక్కడ తమను సీమ ద్రోహులుగా చూపిస్తారోనన్న ఉద్దేశ్యంతో వైసీపీని విమర్శిస్తొంది. ఇలా ఒక ప్రాంత ప్రాజెక్టుల విషయంలో చెయ్యలేదని ప్రశ్నిస్తే కేసులు.... చెయ్యాలని కోరితే మేము మీకంటే ఎక్కువ చేస్తున్నామంటూ బురదజల్లకోవడం మానీ రాయలసీమ అభివృద్దికి పాటుపడాలని సీమ జనం కోరుతొంది.

