ఢిల్లీ :
ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, తక్షణం రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ ఢిల్లీలో పార్లమెంట్ ఎదుట వైసీపీ ఎంపీలు నిరసనకు దిగారు. వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాస్, మిధున్ రెడ్డి, గొల్ల బాబూరావు, వైఎస్ అవినాష్ రెడ్డి, మేడా రఘునాథరెడ్డి, తనూజా రాణి, డాక్టర్ మద్దిల గురుమూర్తిలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్బంగా వైసీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో శాంతిభద్రతలు లోపించాయని, వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలని వారు కోరారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై అన్యాయంగా దాడులు చేశారన్నారు. అలాగే వారిపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపారని ఆరోపించారు.
ఏపీలో ఆటవిక పాలన సాగుతోందని ఎంపీలు దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతున్నారని ఆరోపించారు. కూటమి జంగిల్ రాజ్ పై అహింసా విధానంలో పోరాటం చేస్తున్నట్టు వైసీపీ ఎంపీలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి సాగిస్తున్న అరాచకాలను త్వరలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రధాని మోడీ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని ఎంపీలు నినాదాలు చేయడం విశేషం.