• రాహుల్ చైనా వ్యాఖ్యలపై రచ్చ
• రాష్ట్రపతి ప్రసంగంపై చర్చలో లోక్‌సభలో తీవ్ర గందరగోళం
• ఆర్మీ మాజీ చీఫ్ నరవణె పుస్తకంలోని అంశాలను ప్రస్తావించిన ప్రతిపక్ష నేత
• రాజ్‌నాథ్, అమిత్‌షా తీవ్ర అభ్యంతరం...
Delhi :
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళం చెలరేగింది. 2020లో భారత్-చైనా సంక్షోభానికి సంబంధించి భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె రాసిన పుస్తకంలోని అంశాలను ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రస్తావించడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోం మంత్రి అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికార, విపక్షాల నడుమ వాగ్యుద్ధం, గందరగోళం నడుమ సభ మంగళవారానికి వాయిదాపడింది. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ దేశభక్తిని ప్రశ్నిస్తూ తీవ్రంగా విమర్శించారు. తర్వాత మాట్లాడిన రాహుల్... తొలుత ఆయన విమర్శలకు స్పందిస్తానంటూ భారత్-చైనా సంక్షోభంపై జనరల్ నరవణె తన పుస్తకంలో పేర్కొన్న స్మృతులను ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. మంత్రి రాజ్‌నాథ్ అభ్యంతరం తెలిపారు. ఆ పుస్తకం ప్రచురితమైందో లేదో రాహుల్ స్పష్టత ఇవ్వాలన్నారు. అయితే చైనా ట్యాంకులు అన్న పదాన్ని విపక్ష నేత పదే పదే లేవనెత్తాలని చూడడంతో సభలోని ప్రతి బీజేపీ నేతా తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. ఆ పుస్తకం అధికారికం కాదని.. ఇంతవరకు ప్రచురణకే నోచుకోలేదని.. దానిలోని అంశాలను సభలో ఎలా ప్రస్తావిస్తారని రాజ్‌నాథ్ నిలదీశారు. సైనిక దళాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆ సమయంలో సభలో ప్రధాని మోదీ కూడా ఉన్నారు. ప్రచురితం కాని పుస్తకంలోని అంశాలను ఆయన ఎలా ప్రస్తావిస్తారని అమిత్‌షా నిలదీశారు. తన మాటలకు వారు భయపడకపోతే ఎందుకు మాట్లాడనివ్వడం లేదని రాహుల్ ప్రశ్నించారు. తాను చదివేది నూరు శాతం అధికారికమన్నారు. సభ కార్యకలాపాలతో సంబంధం లేని పుస్తకం లేదా దినపత్రిక క్లిప్పింగ్‌లలోని అంశాలను ప్రస్తావించడానికి వీల్లేదని స్పీకర్ ఓం బిర్లా రూ లింగ్ ఇచ్చారు. అయితే తాను చదువుతున్నది అధికారికమైనదేనని, దాని నుంచి కోట్ చేస్తానని రాహు ల్ స్పష్టంచేశారు. ఆ పుస్తకాన్ని ప్రచురించలేదని.. అందుచేత దానిని ప్రస్తావించడానికి వీల్లేదని రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు.
జనరల్ నరవణె రాసిన పుస్తకాన్ని ప్రచురించడానికి ప్రభుత్వం అనుమతించడం లేదని రాహుల్ ఆరోపించారు. తన వైఖరిని తెలియజేసేందుకు వేరే మ్యాగజైన్ వ్యాసంలోని అంశాలను ప్రస్తావిస్తున్నానని చెప్పారు. దీనిని కూడా స్పీకర్ అనుమతించలేదు. రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. రాహుల్ ఆరోపిస్తున్నట్లు ప్రభుత్వం గనుక ఆ పుస్తకం ప్రచురణను అంగీకరించనట్లయితే జనరల్ నరవణె కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. సభను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. సభాపతి రూలింగ్ ఇచ్చిన తర్వాత కూడా విపక్ష నేత దానిని ఉల్లంఘిస్తున్నారని మంత్రి రిజిజు ఆక్షేపించారు. ఆర్మీ మాజీ చీఫ్ పుస్తకంలోని అంశాలను ప్రస్తావించొద్దని ఓం బిర్లా పలు సార్లు హెచ్చరించినా రాహుల్ వినిపించుకోలేదు. రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడడం ఆయనకు ఇష్టం లేకపోతే తదుపరి వక్తగా ఉన్న ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌కు అవకాశమిస్తానని సభాపతి స్పష్టంచేశారు. అఖిలేశ్, టీఎంసీ నేత కల్యాణ్ బెనర్జీ తదితరులు రాహుల్‌కు మద్దతిచ్చారు. అటు విపక్షం, ఇటు అధికార పక్ష సభ్యులు పరస్పరం నినాదాలకు దిగడంతో స్పీకర్ తొలుత మధ్యాహ్నం 3 గంటల వరకు ఒకసారి.. 4గంటల వరకు రెండోసారి సభను వాయుదావేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేదు. చివరకు సభ మంగళవారానికి వాయిదాపడింది.