Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చొద్దు .... - ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే పరస్పర దూషణలు, దాడులు.... - సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

02 Feb 2026
11:49 PM
69

 

 

 

విజయవాడ  :
తిరుమల లడ్డూ కల్తీ అరోపణలు... సిబిఐ నివేదిక వ్యవహారం రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య అగ్గి రాజేయగా, 
రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చొద్దని ఇరు పార్టీలకు సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య ఓ లేఖలో సూచించారు. ఏపీలో ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే విధంగా టిడిపి, వైసిపి పార్టీలు పరస్పర దూషణలు, దాడులకు తెగబడుతున్నాయిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్రెడ్డి, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ల సొత్తుకాదని, ప్రజల ఆస్తియనేది అధికార, ప్రతిపక్షాలు గ్రహించాలని అయన హితవు పలికారు.
ఈ మేరకు ఈశ్వరయ్య ప్రకటన విడుదల చేశారు. లేఖ సారాంశం చూస్తే....

మహనీయులు పరిపాలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరుకు మచ్చతెచ్చే విధంగా ఏపీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ఘటనలు చూస్తుంటే ప్రజాస్వామ్యం తలదించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రజా సమస్యల్ని గాలికొదిలేసి కనీస అవగాహన లేకుండా తిరుపతి లడ్డూ వంటి ఆధ్యాత్మిక అంశాన్ని రాజకీయ అస్త్రంగా మార్చి, పరస్పర దూషణలకు పాల్పడడం ఆయా నేతల అవివేకానికి నిదర్శనం. వైసిపి, టిడిపి రెండు పార్టీలు సిగ్గుపడాల్సిన విషయం. తమ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను కప్పిపుచ్చేందుకు రాష్ట్రాన్ని అరాచకాల అడ్డాగా మార్చేందుకు ప్రయత్నం చేయడం శోచనీయం.
హుందాతనాన్ని కోల్పోయి వైసిపి నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలతో టిడిపి శ్రేణులు సంయమనం కోల్పోయి ప్రవర్తించడంతో జరిగిన పరిణామాలు విచారకరం. ఇళ్ల మీద, కార్యాలయాల మీద దాడులు, మహిళలు ఉన్నప్పటికీ గంటల తరబడి నిర్బంధించడం చూస్తే గత వైసిపి పాలనకు, నేటి చంద్రబాబు పాలనకు మధ్య ఎలాంటి తేడా లేదనేది అర్థమవుతోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు నాడూ, నేడు ప్రేక్షకపాత్ర వహించడం చట్టంపట్ల ప్రజలకున్న గౌరవాన్ని తగ్గిస్తుంది. ఎవరు అధికారంలోకి వస్తే వారు తమ అజెండాతో, వ్యక్తిగత కక్షలతో హింసకు పాల్పడితే ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడుంటుందని ప్రశ్నిస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రౌడీ దర్బారు కాదు. ఇది ఏ ఒక్కరి వ్యక్తిగత జాగీరు కాదు. ఇది ఆరు కోట్ల ప్రజల ఆస్తియనేది అధికార, ప్రతిపక్ష పార్టీలు గ్రహించాలి. రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలను పక్కనపెట్టి పరస్పర నిందారోపణలు, దూషణలతోనే టిడిపి, వైసిపి పార్టీలు కాలం వెళ్లబుచ్చడం సరైందికాదు. రాజకీయాల్లో హుందాతనంగా వ్యవహరించాల్సిందిపోయి వ్యక్తిగత దూషణలు, మహిళలను అవమానకరంగా మాట్లాడడం, పగ ప్రతీకారాలు, దాడులు, ప్రతి దాడులకు ఆస్కారమివ్వడం విచారకరం. అధికార తెలుగుదేశం, విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల వైఖరి ప్రజాస్వామిక వ్యవస్థకు తూట్లుపొడుస్తున్నది.

రాష్ట్రంలోని నిరుద్యోగం, నిరక్షరాస్యత, విద్య, వైద్యం, వ్యవసాయరంగ సంక్షోభం, రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు, కార్మిక హక్కుల పరిరక్షణ, రాష్ట్రాభివృద్ధి వంటి పలు సమస్యల గురించి చర్చించి పరిష్కార మార్గాలు అన్వేషించాల్సిన వైసిపి, టిడిపిలు ప్రజల దృష్టిని మళ్లించేందుకు, హింసాత్మక రాజకీయ పద్ధతులను అవలంభించడం దుర్మార్గం. గతంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం నేతలకు వ్యతిరేకంగా దూషణలు, దాడులు చేయగా; ప్రస్తుతం అధికారంలోని కూటమి ప్రభుత్వం అదే వైఖరిని అవలంభిస్తున్నది. మొత్తానికి బూర్జువా పార్టీలుగా రాష్ట్రాన్ని పరిపాలించిన వైసిపి, టిడిపిలు దొందూ... దొందే..., అన్నట్లుగా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో అధికారం, పాలకుల మార్పు తప్ప పాలనా విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టమవుతోంది.

రాజకీయాల్లో హుందాతనానికి తప్ప హింసకు తావుండకూడదు. నిజాయితీ, విలువలకు ఆస్కారముండాలేగాని వ్యక్తిగత దూషణలకు, దాడులకు కాదనేది ఇరు పార్టీలూ గ్రహించాలి. రాష్ట్రంలోని అరాచక శక్తులు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ ఉక్కుపాదం మోపాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ ఒక్కరి సొత్తూ కాదని, ఇది ఆరు కోట్ల ప్రజల ఆస్తియనేది పాలకులు గుర్తెరగాలి. ప్రజలు బూర్జువా రాజకీయ పార్టీల వ్యవహారశైలిని గమనిస్తున్నారనేది సత్యం.

ఇప్పటికైనా టిడిపి, వైసిపి పార్టీలు సంయమనం పాటించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చర్చను లేవనెత్తాలి. అధికార, ప్రతిపక్ష నేతలు విచక్షణతో మెలిగి భావి తరాలకు ఆదర్శంగా నిలవాలి. లేనిపక్షంలో ప్రజలే సరైన సమయంలో బుద్ధి చెబుతారనేది వాస్తవం.

 

Article Image

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!