Adulterated ghee:
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ అంశంలో సీబీఐ, సిట్ ఇచ్చిన నివేదిక విషయంలో ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నివేదికను పరిశీలించి సమగ్ర విచారణ జరిపేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ అధ్యక్షతన ఏకసభ్య కమిషన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి సేకరణ, టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలను ఈ కమిషన్ ప్రధానంగా పరిశీలించనుంది. దినేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1983 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి కాగా, ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. పరిపాలనలో అపారమైన అనుభవం ఉన్న అయన తన సుదీర్ఘ ప్రస్థానంలో పౌర సరఫరాలు, ఆహార శాఖ వంటి కీలక విభాగాల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది.

కమిషన్ విధులు.. :
ఈ ఏకసభ్య కమిషన్ ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కొనుగోలుకు సంబంధించి సిట్ రిపోర్ట్‌లో ఉన్న లోపాలను విశ్లేషించనుంది. 2019 నుండి 2024 మధ్య కాలంలో నెయ్యి నాణ్యత విషయంలో నిబంధనలు ఎలా ఉల్లంఘించారు ? టెండర్ నిబంధనలను ఎవరి కోసం మార్చారు? అనే కోణంలో ఈ విచారణ జరగనుంది. అంతేకాకుండా బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంపెనీలకు కాంట్రాక్టులు ఎలా దక్కాయి .. ఇందులో అధికారుల పాత్ర ఎంత అనే దానిపై కూడా లోతైన అధ్యయనం చేయనుంది. ఈ అధ్యాయనం అనంతరం కమిషన్ 45 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
నివేదిక అందిన తర్వాత సూత్రధారులపై చర్యలు :
కేవలం పరిపాలనాపరమైన లోపాలను మాత్రమే కాకుండా, ఈ కల్తీ వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించడం ఈ కమిషన్ ప్రధాన లక్ష్యం. లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి అవసరమైన సిఫారసులను దినేష్ కుమార్ కమిటీ ప్రభుత్వానికి సమర్పించనుంది. సిట్ ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ ఆధారంగా, మరింత లోతుగా విచారణ జరిపి నిర్ణీత కాలవ్యవధిలోగా ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది.
అయితే ఇప్పటికై సిట్, సిబిఐ విచారణ జరుగుతుండగా, ఇలా ఒకే అంశంపై ఒకే సమయంలో మళ్ళీ సమాంతరంగా మరొక విచారణ కమిషన్ నియమించడం పలు అనుమానాలకు తావిస్తొంది. ఇది చట్ట విరుద్ధమని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. అంతేకాకుండా కేవలం సిట్, సిబిఐ నివేదికలు అధికార పార్టీకి అనుకూలంగా రాలేదని, వైసీపీ నేతలను ఇబ్బందులు పెట్టేందుకు ఇలా మళ్లీ కమిషన్ ఏర్పాటు చేస్తున్నారంటూ వైసీపీ తీవ్రంగానే తప్పు పడుతొంది. మీరు నియమించిన అధికారులే సిట్ లో ఉండగా, మళ్లీ కమిషన్ వెయ్యడమనేది కక్ష సాధింపులో భాగమేనని, ఇప్పటికే తమ వద్ద ఉన్న సాక్ష్యాలతో మండలిలో చర్చకు రావాలని పట్టుబడుతుండగా, ప్రభుత్వం మాత్రం ప్రత్యేక కమిషన్ ను ఏర్పాటు చెయ్యడం పట్ల అసక్తినే రేపుతొంది. కానీ టిడిపి నేతలు మాత్రం సిట్ అనేది కేవలం క్రిమినల్ కోణంలో దర్యాప్తు చేస్తే, ఈ ఏకసభ్య కమిషన్ విధానపరమైన నిర్ణయాలు, టెండర్ల నిబంధనల ఉల్లంఘన వంటి వ్యవస్థాగత లోపాలపై దృష్టి సారిస్తుందని, కాబట్టి, వీటి పరిధులు వేర్వేరుగా ఉన్నంత వరకు ఈ నియామకం చట్టబద్ధమే అవుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కోర్టులో దీనిపై సవాల్ చేస్తే అది తుది కానుంది.

వైసీపీ నేతల టార్గెట్ గానే ఏకసభ్య కమిషన్ :
వైసీపీ నేతల టార్గెట్ గానే ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారని టిటిడి మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే భూమి కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే స్వామి వారి ఆగ్రహానికి గురి అవుతున్న టిడిపి నేతలు తప్పులకు చెంపలేసుకోవడం మానేసి కక్ష పూరిత చర్యలకు దిగారని భూమన మండిపడ్డారు. తాను అనుకున్నట్టు రాజకీయ కుట్ర సాగకపోవడంతో ఇప్పుడు ఏకసభ్య కమిషను వేశారన్నారు. దీన్ని పూర్తిగా రాజకీయ ఎత్తుగడగానే భావిస్తున్నామని, ఏకసభ్య కమిషన్ చాలా ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ప్రభుత్వానికి సిట్ చేసిన సిఫార్సులేంటో బయట పెట్టలేదని, ఆ పని చేయకుండా మీడియాను అడ్డుపెట్టుకుని, తమపై వ్యతిరేక కథనాలతో బురద జల్లేందుకే ఏకసభ్య కమిషన్ వేశారన్నారు. కొత్త నాటకంలో భాగమే ఏకసభ్య కమిషన్ అని అన్నారు. మీడియాతో తానే సొంతంగా ట్రయిల్ నడిపి, గిట్టని వారిని నేరస్తులుగా నిర్ధారించాలని చంద్రబాబు తహతహలాడుతున్నారన్నారు.
ఇంత నాటకం కంటే, కమిషన్ చైర్మన్గా చంద్రబాబే వుంటే సరిపోతుందని, టార్గెట్ చేసుకున్న వారికి తానే జడ్జీగా శిక్షలు వేస్తే సరిపోతుందన్నారు. చంద్రబాబుకు చట్టం, న్యాయస్థానం, వ్యవస్థలపై నమ్మకం లేదన్నారు. అంధత్వపు అధికార పిచ్చికి ఇది పరాకాష్ట అని, కల్తీ జరిగి వుంటే మొదటి బాధ్యుడు చంద్రబాబే అని, భోలేబాబాను తీసుకొచ్చింది చంద్రబాబే అని చెప్పుకొచ్చారు.