ఇంటర్నెట్ డెస్క్ :
దేశంలో బాంబు బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా దుండగులు కోర్టులను లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు పాల్పడ్డారు.తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు గుర్తు తెలియని అంగతకుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు, కరీంనగర్ జిల్లా కోర్టుకు, ఎపీలోని రాజమహేంద్రవరం జిల్లా కోర్టుకు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. కరీంనగర్ జిల్లా కోర్టులో బాంబులు అమర్చామని,12:05 గంటలకు పేలుతాయని మెయిల్ వచ్చింది. న్యాయమూర్తులు, సిబ్బంది, న్యాయవాదులను పోలీసులు బయటకు పంపించారు. అనంతరం బాంబు స్క్వాడ్ (Bomb Squad), డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అయితే వారికి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. మరోవైపు నాంపల్లి సీబీఐ కోర్టుకు సైతం బెదిరింపులు రావడంతో బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. రాజమండ్రి జిల్లా కోర్టుకు సైతం బెదిరింపులు రావడంతో న్యాయమూర్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు కోర్టు ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బాంబు బెదిరింపులతో న్యాయమూర్తులు, అడ్వకేట్‌లు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు.
ఇలాగే గత నెల 8వ తేదీని కూడా అనంతపురం, చిత్తూరు, ఏలూరు కోర్టులకు మధ్యాహ్నం సమయంలో బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విస్తృత తనిఖీలు నిర్వహించారు. అయితే కోర్టులో బాంబు పెట్టారంటూ ఈ మెయిల్ వచ్చినట్లు అనంతపురం జిల్లా కోర్టు జడ్జి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి ఈ మెయిల్ వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీసి ఎలాంటిబాంబులు లేవని తేల్చారు.
దేశంలో ప్రతి నిత్యం ఏదో ఒక ప్రాంతంతో బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఇది వరకుఎయిర్ పోర్టులు (Airports), ఫ్లైట్లు, రైల్వే స్టేషన్ వంటి రద్దీ ప్రాంతాలతో పాటు స్కూళ్లు, కోర్టులకు సైతం బెదిరింపులు వచ్చేవి. అంతేకాకుండా ప్రధాన నగరాలకే గతంలో బాంబు బెదిరింపులు వచ్చాయి. కానీ ఇప్పుడు జిల్లా కోర్టులను సైతం దుండగులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. అయితే బెదిరింపులలో చాలా వరకు నకిలీవి ఉంటున్నాయి. దీంతో అధికారులు, ప్రజలు, పోలీసుల భయాందోళనకు గురి కావడంతో పాటు సమయం వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.