* 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీడ్రా.
* లాటరీ పేరుతో కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని అంబటిపై ఫిర్యాదు.
(Ambati Rambabu) :
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్ జారీ అయింది. గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ వేశారు. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో అంబటి వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అంబటి నేతృత్వంలో లక్కీ డ్రా పేరుతో లాటరీ టికెట్ల విక్రయాలు జరిగాయి. సచివాలయ వలంటీర్స్ ద్వారా ఈ టికెట్ల అమ్మకాలు జరిగాయి. 2023లో సంక్రాంతి లక్కీ డ్రా లాటరీ టికెట్లు అమ్మకాలపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు సబ్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో అంబటి రాంబాబుపై 2023 జనవరి 16న సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ లక్కీ డ్రా కేసులో తాజాగా పీటీ వారెంట్ జారీ అయింది.
మూడు రోజుల క్రితం కూడా అంబటి రాంబాబుకు సంబంధించిన కేసులో పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. గతేడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన అంబటి పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని వెళ్లారు. ఈ ఘటనపై అప్పట్లోనే పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ విషయంపై కేసు దర్యాప్తు జరుగుతోందని పోలీసులు పీటీ వారెంట్లో ప్రస్తావించారు. దీంతో రేపు అంబటి విడుదలవుతారన్న సమయంలొ ఈ పీటీ వారెంట్ జారీ చెయ్యడం పట్ల సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.