- జడ్పీ చైర్మన్ గా బొత్స కుమార్తె ప్రకటన..
- *తన కుమార్తె ను జడ్పీ చైర్మన్ గా పోటీ చెయ్యించాలని భావించిన శీను..
- * తన రాజకీయ భవిష్యత్తు...తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని భావించిన శీను...
విజయనగరం :
ఎపిలో త్వరలోనే జరగనున్న స్థానిక ఎన్నికల ముందు ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, ప్రస్తుత శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహాన్ రెడ్డికి పంపారు.
మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆ పార్టీకి రాజీనామా చెయ్యడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయనగరం జడ్పీ ఛైర్మన్ గాను, భీమిలి వైసీపీ ఇన్‌ఛార్జ్‌గానూ చిన్న శ్రీను పనిచేస్తున్నారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు విజయనగరం జిల్లా అధ్యక్ష పదవి, భీమిలి ఇన్‌ఛార్జ్ పదవికీ కూడా ఆయన రాజీనామా చేశారు.
కొన్నాళ్లుగా బొత్స సత్యనారాయణ, చిన్న శ్రీను మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ప్రచారం సాగుతొంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీ ఛైర్మన్ గా తన కుమార్తె పోటీ చేస్తుందని బొత్స గత కొంత కాలంగా చెబుతూ వస్తున్నారు. అంతేకాకుండా పార్టీలో మేనల్లుడి ప్రాధాన్యత తగ్గించేలా బొత్స ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిన్న శ్రీను వైసీపీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన టీడీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే మరి కాసేపట్లో సీఎం చంద్రబాబును చిన్న శ్రీను కలవనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఎదగలేనన్న అసంతృప్తే రాజీనామాకు దారితీసిందా .. ?
మొదటి నుంచి మేనమామ బొత్స అండదండలతో ఎదిగిన శీను... గత కొంత కాలంగా తన ఎదుగుదలకు అడ్డుతగులుతున్నారన్న అసంతృప్తిలో అయనలో పెనవేసుకుపోయినట్లుగా తెలుస్తొంది. బొత్స కుమార్తెను జడ్పీ ఛైర్మన్ ను చెయ్యాలనుకుంటున్నట్లు చెప్పిన నాటి నుంచి శీనులో ఈ అసంతృప్తి మరింత తీవ్రమైనట్లు వినికిడి. భీమీలి నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతుండటంతో..తన కుమార్తె ను జడ్పీ చైర్మన్ గా పోటీ చెయ్యించాలని శీను భావించారు. దీంతో తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని అనుమానాలు బలపడ్డాయి. ఈ నేపధ్యంలోనే శీను పార్టీ వీడారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇదే అసరాగా చేసుకున్న ప్రత్యక్ష పార్టీ నేతలు శీను గాలం వెయ్యడం...అధికార పార్టీ కావడంతో వెనక్కి తిరిగి చూడకుండా పార్టీ వీడారని టాక్ నడుస్తొంది.
భీమీలి... జిల్లా అధ్యక్ష బాధ్యతలను వైసీపీ ఎలా భర్తీ చేసుకుంటుందొ.. ? :
చిన్న శీను ప్రస్తుతం జడ్పీ ఛైర్మన్ గానే కాకుండా జిల్లా అధ్యక్షుడిగాను, భీమీలి నియోజకవర్గం వైసీపీ ఇన్ చార్జిగాను కొనసాగుతున్నారు. ఇన్నీ పదవులిచ్చి పార్టీ శీనుకు ప్రాధాన్యతనే ఇచ్చింది. కానీ మేనమామ మీద అసంతృప్తి కారణంగా అయన పార్టీని వీడారు. అయితే ఇప్పుడు భీమీలి, జిల్లా అధ్యక్ష బాధ్యతలను ఎవరికి అప్పగిస్తుంది....ఈ లోటు ఎలా భర్తీ చేస్తుందన్నది ప్రాధాన్యతను సంతరించుకుంది. శీను నష్టం పార్టీకి ఎంత వరకు ఉండన్నది కాలం నిర్ణయించాల్సి ఉంది.
నిన్న మొన్నటి వరకు విమర్శించిన పార్టీలోకే ... :
జిల్లా పార్టీ అధ్యక్షుడిగాను.... భీమీలి ఇన్ చార్జిగాను .... జడ్పీ ఛైర్మన్ గాను ఉంటూ కూటమిపై పెద్దగానే విమర్శలు గుప్పించారు. వైసీపీ చేపట్టిన ప్రతి నిరసనల్లోను ముందుండి కూటమికి వ్యతిరేకంగా నినదించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్దితో జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు టిడిపిలో చేరానని, రాష్ట్రం సంక్షేమంలో దుసుకుపోతుందంటూ ఇప్పుడు ప్రశంసలు గుప్పించడమే ఆలోచించాల్సి విషయం.