AP@22 .....
పన్నుల ఆదాయంలో ఎపి ర్యాంకు 22....
ప్రచారం బారెడు.. పనిమాత్రం జానెడు..
విజనరీ నాయకత్వంలో ఏపీ వెనుకబడి పోయింది.....
కల్పిత జీఎస్‌డీపీ గణాంకాలతో అబద్దాలు ఆగకుండా కొనసాగుతున్నాయంటూ ..
ఎక్స్ లో చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన మాజీ సీఎం జగన్..

YS Jagan :
పన్నుల ఆదాయంలో ఎపి ర్యాంకు పడిపోవడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు పనితీరుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. ప్రచారం ఎక్కువ.. పని తక్కువ అన్నట్లుగా చంద్రబాబు విజన్ ఉందని ఎద్దేవా చేశారు. పన్నుల ఆదాయంలో దేశంలో ఏపీ 22వ ర్యాంకులో ఉందని.. అయినప్పటికీ చంద్రబాబు మోసాలు, అబద్ధాలు ఆగకుండా కొనసాగుతున్నాయంటూ ఎక్స్ లో విమర్శించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటుందనేందుకు ప్రభుత్వ ఆదాయాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయని జగన్ పేర్కొన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కల్పిత జీఎస్‌డీపీ గణాంకాలతో ప్రజలను మభ్యపెట్టి, రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందనే తప్పుడు భావన కలిగిస్తోందన్నారు.

2024–25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 11.75 శాతంగా ఉందని, జాతీయ వృద్ధిరేటు 9.8శాతం మాత్రమేనని, అలాగే 2025 –26లో రాష్ట్ర వృద్ధి 10.75శాతంగా ఉంటుందని, జాతీయ వృద్ధిరేటు 8.0 శాతం మాత్రమేనని చంద్రబాబు ప్రభుత్వం సోమవారం ప్రకటించిందన్నారు. దీని ప్రకారం 2023–24 నుంచి 2024–25 మధ్య రెండేళ్ల కాలానికి సగటు వార్షిక వృద్ధిరేటు 11.09 శాతంగా చూపిస్తోందన్నారు.
అంతేకాదు, వాస్తవ జీఎస్‌డీపీ వృద్ధి పరంగా ఈ ఏడాది రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉందని కూడా ప్రభుత్వం చెబుతోందని పేర్కొన్నారు. అయితే ఇవేవీ స్వతంత్ర సంస్థలు విడుదల చేసిన గణాంకాలు కావు, ఇవి పూర్తిగా చంద్రబాబు కార్యాలయంలో తయారుచేసిన సంఖ్యలే. వాటినే వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ఇంకా, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి 9 నెలల 23 రాష్ట్రాల పన్నుల ఆదాయాలను CAG అప్‌లోడ్ చేసింది. పన్ను ఆదాయాల వృద్ధి పరంగా ఇతర రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్‌ను పోలిస్తే అత్యంత ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ 23 రాష్ట్రాల్లో, పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉంది. అంటే చివర నుంచి రెండో స్థానంలో ఉంది. అదే కాలంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాలు 9.64% పెరిగితే, ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాలు మాత్రం 1.97% మాత్రమే పెరిగాయి. అయినా కూడా, చంద్రబాబు ప్రకారం ఆర్థిక రంగంలో ఆంధ్రప్రదేశ్ పనితీరు కేంద్ర ప్రభుత్వానికంటే మెరుగైనదని చెప్పడాన్ని తప్పుపట్టారు.
చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఏదైనా విషయంలో మొదటి స్థానం సాధించగలదంటే, అది కేవలం ప్రభుత్వ అప్పులు, అవినీతి, రాజకీయ కక్షసాధింపు చర్యలు, తప్పుడు ప్రచారం లాంటి విషయాల్లో మాత్రమేనని పేర్కొన్నారు.