Friday, 11 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

శ్రీశైలంలో 878 అడుగుల నీరున్నా కేసీ కెనాల్‌కు విడుదల చేయరా .. ?

19 Aug 2026
11:38 AM
195

* రైతుల కష్టాలపై పక్షపాత వైఖరి వీడాలి
* కూటమి ప్రభుత్వ తీరుపై కేసి కెనాల్ రైతులు ఆగ్రహం
* తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైయస్ జగన్ ను కలిసిన కడప జిల్లా రైతులు.
* వైయస్ జగన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్న కడప జిల్లా  కేసి కెనాల్ ఆయకట్టు రైతులు... 
తాడేపల్లి  :
శ్రీశైలం జలాశయంలో తగిన స్దాయిలో నీటిమట్టం ఉన్నప్పటికీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కడప జిల్లా  మైదుకూరు నియోజకవర్గం, చాపాడు మండలానికి చెందిన ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన రైతుల బృందం కలిసి తమ సమస్యలను విన్నవించింది. గతంలో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి, వైయస్సార్సీపీ ప్రభుత్వాల హయాంలో శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడే కేసీ కెనాల్‌కు సకాలంలో సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకున్నారని రైతులు గుర్తుచేశారు. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టులో 878 అడుగులకు పైగా నీరు పుష్కలంగా ఉన్నా కక్షసాధింపు చర్యలతో చుక్క నీరు కూడా వదలకుండా రైతుల పొట్ట కొడుతోందని ధ్వజమెత్తారు. ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నీటి విడుదలయ్యేలా చూడాలని రైతులు వైయస్.జగన్ కి విజ్ఞప్తి చేశారు. అవసరమైతే రైతు పక్షాన ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. 

ఈ సందర్బంగా మాట్లాడుతూ రైతులు ఏమన్నారంటే...

గతంలో 854 అడుగులకే నీళ్లిచ్చారు.. ఇప్పుడేమో పట్టించుకోవడం లేదు : శేఖర్ రెడ్డి (చిన్నగురువలూరు)...
నాడు దివంగత నేత వైయస్సార్ హయాంలో, అలాగే వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడే కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేసి రైతులు సస్యశ్యామలంగా పంటలు పండించుకునేలా చేశారు. కానీ నేడు 878 అడుగులకు నీళ్లు చేరినప్పటికీ కేసీ కెనాల్‌కు చుక్క నీరు కూడా ఇచ్చే ఆలోచనలో ఈ ప్రభుత్వం లేదు. పైర్లు పండించుకోవాల్సిన కీలక సమయంలో నీళ్లు ఇవ్వకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ అన్యాయంపై మాజీ సీఎం వైయస్ జగన్ ని కలిసి విన్నవించాం. ఆయన సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదల చేయాలి.

రైతులపై పక్షపాత వైఖరి నశించాలి : వీరారెడ్డి (చిన్నగురువలూరు)...
గత ప్రభుత్వాలన్నింటిలోనూ శ్రీశైలంలో 854 అడుగులు ఉన్నప్పుడే కేసీ కెనాల్‌కు నీటిని వదిలేవారు. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం 878 అడుగుల నీరున్నా వదలడం లేదు. ఇది ముమ్మాటికీ రైతులపై చూపుతున్న పక్షపాత వైఖరే. ప్రస్తుతం కనీసం తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. శ్రీశైలం నుంచి మాకు రావాల్సిన సాగు, తాగునీటి వాటాను తక్షణమే విడుదల చేయాలి. మాకు న్యాయం చేయాలని వైయస్ జగన్ ని  కోరాం.

పైరు పెట్టుకోవడానికి నీళ్లివ్వరా?  : పాలగిరి శివారెడ్డి (చిన్నగురువలూరు) ... 
వైయస్సార్  హయాంలో కేవలం 850 అడుగులు ఉన్నప్పుడే మాకు కేసీ కెనాల్ ద్వారా సాగునీరు ఇచ్చారు. ఇవాళ 878 అడుగుల మేర నీరున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతుల సమస్యపై స్పందించి నీళ్లు ఇప్పించాలని వైయస్ జగన్ ని కలిశాం. ఆయన ప్రభుత్వంతో మాట్లాడతానని, రైతులకు అండగా ఉంటానని భరోసా కల్పించారు.

చంద్రబాబు పాలనలోనే ఈ కరువు కాటకాలు : శంకర్ రెడ్డి (చిన్నగురువలూరు)... 
గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కానీ, వైయస్ జగన్ ప్రభుత్వంలో గానీ 854 అడుగులకే కేసీ కెనాల్‌కు నీళ్లు వదిలేవారు. కానీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే రైతులకు ఇలాంటి కరువు కాటకాలు, కష్టాలు వస్తాయి. చంద్రబాబు ప్రభుత్వ పక్షపాత ధోరణి, కక్షసాధింపు చర్యల వల్లే ఈ దుస్థితి వచ్చింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మొదటి ప్రాధాన్యతగా కేసీ కెనాల్‌కు నీరిచ్చిన తర్వాతే విద్యుత్ ఉత్పత్తికి, ఇతర అవసరాలకు ఇవ్వాలి. కానీ మా హక్కులను కాలరాస్తూ విద్యుత్ ఉత్పత్తి పేరుతో నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తూ మాకు అన్యాయం చేస్తున్నారు. దీనిపై వైయస్. జగన్ ని కలిసాం. రైతులకు న్యాయం జరిగే వరకు పార్టీ తరపున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కోరాం.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!