Tuesday, 28 July 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

'సర్' గడువును 3నెలలు పొడిగించాలి... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వివేక్ యాదవ్‌కు సీపీఐ బృందం పలు అంశాలతో సవివరమైన వినతి...

13 Jul 2026
03:24 PM
30

* పట్టణాల్లో బీఎల్ఓలుకు అవగహన లోపంతో ఓటర్లకు నష్టం...
* ఓటు హక్కు కోల్పోయే ప్రమాదంలో 40 శాతం మంది ఓటర్లు...
* రేషన్, ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నా పౌరసత్వ నిరూపణ పేరిట వేధింపులేంటి?
*సిఏఏ కు ప్రత్యామ్నాయంగా ఎస్ఐఅర్ వ్యూహమా?
*​అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేసే వరకు వదిలిపెట్టేది లేదు...
*ఎమ్యున్యూరేషన్ ఫార్మ్స్ ఇవ్వగానే రసీదు తప్పనిసరిగా ఇవ్వాలి ...
*సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ ....
* రాజకీయ పార్టీల అప్పీల్స్ అధారంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపుతామని ఎస్ఈసీ హామీ ...

అమరావతి   :
రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న 'సర్'  ప్రక్రియ గడువును తక్షణమే మరో మూడు నెలల పాటు పొడిగించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పించే బాధ్యతను ఎన్నికల కమిషనే  తీసుకో వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్  వివేక్ యాదవ్ ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, మాజీ ఎమ్మెల్సీ జేల్లి విల్సన్, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి. జగదీష్‌లు కలిసి క్షేత్రస్థాయి అక్రమాలు, ఇబ్బందులపై సుదీర్ఘంగా వివరించి, సవివరమైన వినతిపత్రాన్ని సమర్పించారు.


అనంతరం ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడుతూ..అధికారులు ప్రస్తుతం ప్రకటిస్తున్న ఎమ్యున్యూరేషన్ ఫార్మ్స్ లెక్కలు ఎంతమాత్రం సరైనవి కావని, క్షేత్రస్థాయిలో వాస్తవాలు భిన్నంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. అరకొర ఏర్పాట్లు, కాలపరిమితితో లక్షలాది మంది పేద, మధ్యతరగతి పౌరులను ఓటర్ల జాబితా నుండి దూరం చేసే కుట్రలు సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటు హక్కు విషయంలో కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించ కూడదని, తక్షణమే స్పందించి నిర్దిష్టమైన కాలవ్యవధితో గడువును పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

క్షేత్రస్థాయిలో వైఫల్యాలతో..ఓటు హక్కు కోల్పోయే ప్రమాదంలో పౌరులు.... :
​ ప్రభుత్వ అధికారులు చెప్తున్న కాగితపు లెక్కలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి అసలు పొంతనే లేదని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రక్రియ ఎదో ఒక రకంగా కొంతవరకు నడిచినప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో మాత్రం దారుణంగా విఫలమైందని ధ్వజమెత్తారు. నగరాలు, పట్టణాల్లో ఉన్న మెజారిటీ ప్రజలకు అసలు ఈ అప్లికేషన్లు పూర్తిస్థాయిలో అందనే లేదన్నారు. ఒకవేళ కొన్ని చోట్ల అప్లికేషన్లు అందినప్పటికీ, వాటిని ఎలా పూర్తి చేయాలి, ప్రక్రియ విధానం ఏంటనే విషయాలపై ప్రజలను ఎడ్యుకేట్ చేయడంలో, వారిలో అవగాహన కల్పించడంలో బూత్ లెవెల్ అధికారులకే అవగహన లేక ఘోరంగా వైఫల్యం చెందారని ఆరోపించారు. ​బీఎల్ఓల నిష్క్రియాపరత్వం, అధికారుల సమన్వయ లోపం కారణంగానే ఈరోజు కేవలం 60 శాతం మంది మాత్రమే ఫారాలు పూర్తి చేసి ఇవ్వగలిగారని, మిగిలిన 40 శాతం మంది పౌరులు ఓటర్లు కాకుండా పోయే ప్రమాదకర పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిదంగా ఎమ్యున్యూరేషన్ ఫార్మ్స్ ఇవ్వగానే రసీదు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. ఒక్క ఓటరు కూడా తన హక్కును కోల్పోవడానికి వీల్లేదని, అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఓటు కల్పించాల్సిన బాధ్యత కమిషన్‌పైనే ఉందని ఈశ్వరయ్య  స్పష్టం చేశారు.

సిఏఏ కు ప్రత్యామ్నాయంగా ఎస్ఐఅర్ వ్యూహమా?... :
​భారతదేశంలో ఒక పౌరుడి గుర్తింపునకు ప్రామాణికాలైన రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, చివరికి అంతర్జాతీయంగా అత్యున్నత గుర్తింపు కలిగిన పాస్‌పోర్ట్ వంటి బలమైన ఆధారాలు ఉన్నప్పటికీ... ఈ 'సర్' ప్రక్రియలో భారతీయ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి ఇంకా మరేదో కావాలనే పద్ధతిలో నిబంధనలు పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా తీసుకొచ్చిన సిఏఏ చట్టానికి ప్రత్యామ్నాయంగా, దొడ్డిదారిన ఈ 'సర్'ను ఏమైనా రాష్ట్రంలో అమలు చేస్తున్నారా? అని ఈశ్వరయ్య నిలదీశారు. సాధారణ ఓటర్ల నమోదు ప్రక్రియను ఇంత సంక్లిష్టం చేయడం వెనుక, ప్రజలను ఇంతలా తాత్సారం చేయించడం వెనుక ఉన్న అసలు అంతరార్థం, రాజకీయ వ్యూహం ఏమిటని ప్రశ్నించారు.

వలస ఓటర్ల ఇబ్బందులు – 2002 నిబంధనతో తీవ్ర అన్యాయం :
​గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే సామాన్య, పేద ప్రజలు ఉపాధి, కూలి పనులు, ఇతర ఆర్థిక అవసరాల రీత్యా నిరంతరం ఇళ్లు మారుతుంటారని సీపీఐ గుర్తు చేసింది. ముఖ్యంగా అద్దె ఇళ్లల్లో నివసించే వారు తరచూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తున్న తరుణంలో, 2002 ఓటర్ లిస్టులో పేరుండాలనే కొర్రీలు పెట్టడం వల్ల వేలాది మంది అర్హులు జాబితా నుంచి తొలగించబడే ముప్పు పొంచి ఉందన్నారు. అదేవిదంగా ఈ ఎడాది సరైన వర్షాలు లేక రాయలసీమ, ప్రకాశం, పల్నాడు, ఉత్తరాంధ్రలో వలసలు పెరిగాయని దీంతో గ్రామాలు గ్రామాలు ఖాళీగా మారుతుండడంతో ఓటరు నమోదు కావడం లేదన్నారు. స్థానిక పరిస్థితులను, సామాన్యుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా నిబంధనలు రుద్దడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని మండిపడ్డారు.

సీపీఐ డిమాండ్లు ఇవే.... :

*'సర్' ప్రక్రియ గడువును ఎటువంటి తాత్సారం లేకుండా తక్షణమే మరో మూడు మాసాల పాటు పొడిగించాలి.

*​ప్రతి గ్రామ సభలో, వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలో ప్రత్యేక అవగాహన సదస్సులు, సభలను అధికారికంగా ఏర్పాటు చేయాలి.

*​బీఎల్ఓలను పూర్తిస్థాయిలో రంగంలోకి దించి, వారి ద్వారా ప్రజలను చైతన్యపరిచి, అర్హులైన ప్రతీ ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసే బాధ్యతను కమిషనే స్వయంగా తీసుకోవాలి.

సానుకూలంగా స్పందించిన ఎస్ఈసీ వివేక్ యాదవ్... :
​సీపీఐ బృందం లేవనెత్తిన అంశాలు, క్షేత్రస్థాయి ఇబ్బందులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివేక్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. కేవలం సీపీఐ మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని ఇతర ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఈ గడువు పొడిగింపు, ఓటర్ల ఇబ్బందులపై తమకు అప్పీల్ చేశాయని ఈ సందర్భంగా కమిషనర్ గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటు హక్కు రక్షణకు కమిషన్ కట్టుబడి ఉంటుందని పేర్కొంటూ... రాజకీయ పార్టీలు కోరిన విధంగా గడువు పొడిగింపు ప్రతిపాదనలను, క్షేత్రస్థాయి నివేదికలను తదుపరి తుది నిర్ణయం కోసం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెంటనే పంపుతామని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని సీపీఐ బృందానికి ఎస్ఈసీ స్పష్టమైన హామీ ఇచ్చారు.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!