America :
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువలపై ప్రతీకార సుంకాన్ని (Reciprocal Tariffs) 25% నుండి 18% కి తగ్గిస్తామని ప్రకటించారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ సంభాషణ తర్వాత ట్రంప్ ఈమేరకు ట్రుత్ సోషల్ వేదికగా ప్రకటించారు. భారతదేశం కూడా సుంకాలను తగ్గించి అమెరికా వస్తువులపై నాన్-టారిఫ్ అడ్డంకులను తగ్గించడానికి చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
ప్రధాని మోదీ పట్ల స్నేహం మరియు గౌరవం ఉంది. ఆయన అభ్యర్థన మేరకు వెంటనే అమలులోకి వచ్చే విధంగా, మేము అమెరికా మరియు భారత్ మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకరించాము. దీని ద్వారా అమెరికా సుంకాలను తగ్గిస్తుంది. 25% నుండి 18% కి తగ్గిస్తుంది. వారు కూడా అమెరికా వస్తువులపై సుంకాలను తగ్గించడానికి ముందుకుసాగుతారు' అని ట్రంప్ పోస్ట్ చేశారు.
భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపి, బదులుగా అమెరికా, బహుశా వెనిజులా నుండి కొనుగోళ్లను పెంచడానికి అంగీకరించిందని ట్రంప్ అన్నారు.
వాణిజ్యం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడం వంటి అనేక విషయాల గురించి మేము మాట్లాడాము. రష్యన్ చమురు కొనుగోలును ఆపడానికి మరియు అమెరికా మరియు బహుశా వెనిజులా నుండి చాలా ఎక్కువ కొనుగోలు చేయడానికి ఆయన అంగీకరించారు. ఇది ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి సహాయపడుతుంది. ఈ యుద్ధం ప్రతి వారం వేలాది మంది మరణిస్తున్నారు' అని ట్రంప్ పోస్ట్‌లో ఉంది.
స్వాగతించిన మోదీ
డొనాల్ట్ ట్రంప్ ప్రకటనను ప్రధాని మోదీ స్వాగతించారు. ఈ సుంకాల తగ్గింపు భారత పరిశ్రమకు మరియు ఎగుమతిదారులకు ఒక ప్రోత్సాహకంగా అభివర్ణించారు.
'ఈ రోజు నా ప్రియ మిత్రుడు అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది' అని మోదీ Xలో పోస్ట్ చేశారు. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై ఇప్పుడు 18% సుంకం వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఈ అద్భుతమైన ప్రకటన చేసినందుకు భారతదేశంలోని 140 కోట్ల ప్రజల తరపున ట్రంప్‌కు మోదీ ధన్యవాదాలు తెలిపారు.
రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారం ప్రయోజనకరమైనదని, అవకాశాలను తెరిచేదని మోదీ అన్నారు. ప్రపంచ శాంతి మరియు స్థిరత్వంపై ట్రంప్ నాయకత్వాన్ని కూడా ప్రశంసించారు. ఆయన ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని, ఇరు దేశాల భాగస్వామ్యాన్ని అపూర్వమైన శిఖరాలకు తీసుకెళ్లడానికి ఎదురుచూస్తోందని అన్నారు.
వాణిజ్య వివాదానికి కారణం :
గత సంవత్సరం భారత ఎగుమతులపై అమెరికా సుంకాలు 50% వరకు పెంచింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. వాణిజ్య వివాదం తలెత్తింది. ఇప్పుడు ట్రంప్ నుంచి ఈ ప్రకటన రావడంతో ఇరుదేశాల మధ్య సమస్యలు పరిష్కారం కానున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే కారణంతో ట్రంప్ భారత్ పై సుంకాలను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచిన విషయం తెలిసిందే.