udget 2026-27:
కేంద్ర బడ్జెట్ 2026–27లో ప్రకటించిన పథకాలు, విధానాలు తెలంగాణా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తున్నాయి. ముఖ్యంగా హై–స్పీడ్ రైల్ కారిడార్‌లు ప్రధాన ఆకర్షణగా మారాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణే వైపు హై–స్పీడ్ రైలు మార్గాలు అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులతో హైదరాబాద్ కేంద్రంగా ఐటీ, తయారీ, సేవల రంగాలకు కనెక్టివిటీ మరింత బలపడనుంది. అర్బనైజేషన్ దిశగా టియర్–II, టియర్–III నగరాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి పట్టణాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడే అవకాశం ఉంది. ఇది ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది. ఐటీ రంగానికి సంబంధించి డేటా సెంటర్ సేవలకు 2047 వరకు పన్ను రాయితీలు ఇవ్వడం తెలంగాణకు పెద్ద ప్రోత్సాహంగా మారనుంది. ఐటీ సేఫ్ హార్బర్ పరిమితుల విస్తరణతో హైదరాబాద్ ఐటీ ఎకోసిస్టమ్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించే పరిస్థితి ఏర్పడింది.
ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, హైటెక్ టూల్‌రూమ్స్ రంగాల్లో ప్రకటించిన పథకాలు హైదరాబాద్ పరిసర పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధికి దోహదపడనున్నాయి. ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్స్ తయారీ, ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ద్వారా పరిశ్రమల విస్తరణకు మార్గం సుగమమవుతోంది. విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో యూనివర్సిటీ టౌన్‌షిప్స్, STEM గర్ల్స్ హాస్టల్స్, కేర్‌గివర్ శిక్షణ కార్యక్రమాలు యువతకు కొత్త అవకాశాలు అందించనున్నాయి. ఉపాధి దిశగా అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి.
ఇక ₹2 లక్షల కోట్ల SASCI స్కీమ్ ప్రధానంగా తమకు అవసరమైన ప్రాధాన్య ప్రాజెక్టుల కోసం వినియోగించుకునే అవకాశం ఉంటుంది. MSME గ్రోత్ ఫండ్, TReDS, క్రెడిట్ గ్యారంటీ పథకాలతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక మద్దతు లభించనుంది. పబ్లిక్ క్యాపెక్స్ పెంపుతో రవాణా, ఎనర్జీ, హెల్త్ రంగాల్లో చేపట్టే ప్రాజెక్టులు రాష్ట్రాలకు దీర్ఘకాల లాభాలు అందించే అవకాశం ఉంది.