*మంత్రిగా కొండా సురేఖ కొనసాగిన రోజులు...
* వైఎస్ఆర్ మరణానంతరం జగన్ సిఎం కావాలంటూ పదవికి రాజీనామా...
*ఇప్పుడు కుమార్తె వ్యాఖ్యలతో భర్తరఫ్ ...
Astranews :
కొండా సురేఖా. ఇప్పుడు తెలంగాణా కాంగ్రెస్ వ్యవహారాలను మొత్తం ఉత్కంఠగా మార్చిన నేత. అయితే అమె మంత్రి పదవి చేపట్టిన ప్రతి సారి ఎదో కారణంగా అమె మంత్రి పదవి పూర్తి కాలం పాటు చేపట్టకుండానే దూమవుతున్నారు. ఇప్పుడు కూడా కుమార్తె చేసిన వ్యాఖ్యల కారణంగా మంత్రి పదవి నుంచి భర్తరఫ్ కావడంతో మరోమారు అమె మంత్రి పదవి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్నారు ఆమె భర్త కొండా మురళీధర్ రావు అండదండలతో అంచలంచలుగా ఎంపీటీసీ నుండి మంత్రి వరకు ఎదిగారు. వరంగల్ జిల్లా రాజకీయాలలో ఒక వెలుగు వెలిగిన కొండా దంపతులు అటు విపక్షంలో ఇటు సపక్షంలో ఎవరికి గిట్టరు.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన సురేఖ తొలి నుండి సొంత పార్టీలోనే శత్రుత్వం ఇబ్బందికరంగా మారుతొంది. ఉమ్మడి జిల్లాలో భారీ అనుచర గణం కలిగిన కొండా దంపతుల నిర్ణయాలు తొలి నుండి వివాదాస్పదంగా ఉంటాయి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో.. ఎవరిపై ఆరోపణలు ఎక్కు పెడతారో నిత్యం వెంట ఉండే క్యాడర్ కే అంతుచిక్కని రహస్యంగా మారింది.
2009 శాసనసభ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖ అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు తొలి నుండి వైయస్ అనుచరులుగా ముద్రపడిన సురేఖ బీసీ సామాజిక వర్గం నుండి గెలిచిన మహిళ కావడంతో నాడు వైఎస్ మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. 2009 మే 25న ఆమె వైయస్ ప్రభుత్వంలో మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ అప్పటి సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో సిఎం అయ్యాకా అయన మంత్రివర్గంలో కొండా సురేఖకు మొదటి సారి మంత్రిగా అవకాశం కల్పించారు. వరంగల్ జిల్లాలో వైఎస్ఆర్ కు అత్యంత అప్తులుగా గుర్తింపు పొందడంతో అయన సురేఖాకు మంత్రిగా అవకాశం కల్పించారు. కానీ ప్రభుత్వం ఎర్పడిన అతి తక్కువ కాలంలోనే వైఎస్ఆర్ హెలీకాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. దీంతో అయన తనయుడు వైఎస్ జగన్ ను సిఎంగా చూడాలని, వైఎస్ఆర్ తనయుడు కాకుండా మరెవ్వరిని సిఎంగా ఉహించుకోలేనని తెగేసి చెప్పింది. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి సీనియర్ నాయకుడు కొనిజేటి రోశయ్యను కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఆయన క్యాబినెట్లో ఉంటూనే సురేఖ సీఎంను మార్చాలని డిమాండ్ తెరపైకి తెచ్చారు. వైయస్ వారసుడిగా జగన్ ను సీఎంగా చేయాలని సురేఖ సొంత పార్టీలో ఎదురు దాడి చేశారు. రోశయ్య మంత్రివర్గంలో కొనసాగుతూనే ఆయనకు సహాయ నిరాకరణ ప్రకటించారు. అంతేగాక రోశయ్య అనుభవాన్ని తక్కువ చేసి మాట్లాడి వృద్ధాప్యంలో ఉన్న ఆయనను సీఎం పదవి నుండి తప్పించాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డిని ప్రకటించే వరకు తాను విశ్రమించనని ఎమ్మెల్యేలతో సంతకాలు సేకరించారు. కాంగ్రెస్ అధిష్టానానికి కంట్లో నలుసయ్యారు. ఒక దశలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఆగ్రహానికి గురయ్యారు. జగన్ కోసం పట్టు వదలకుండా మొండి వాదనతో అధిష్టానానికి వ్యతిరేకంగా ముందుకెళ్లిన సురేఖ 2009 అక్టోబర్ 30వ తేదీన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోనే మంత్రి పదవికి దూరమయ్యారు.
మళ్లీ తిరిగి 2018 ఎన్నికల నాటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో మరోసారి పరకాల నుండి పోటీ చేసి ఓడిపోయారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయనకు వెన్నంటి ఉండి 2023 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో సురేఖకు ఆయన మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అధికారంలో ఉంటూ మంత్రిగా బాధ్యత నిర్వహిస్తూనే సురేఖ పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై అనేక మార్లు ఆరోపణలు చేశారు.జిల్లాలో ఆయన జోక్యాన్ని ప్రశ్నించారు. జిల్లాలోని ఎమ్మెల్యేలంతా ఇన్చార్జ్ మంత్రితో సఖ్యతతో ఉండడంతో వారందరితోను సురేఖ శత్రుత్వం పెంచుకున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన శాసనసభ్యులు కడియం శ్రీహరి రేవూరి ప్రకాష్ రెడ్డి దొంతి మాధవరెడ్డి నాయిని రాజేందర్ రెడ్డి గండ్ర సత్యనారాయణరావు, ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి మేయర్ గుండు సుధారాణి లపై అనేక సందర్భాల్లో ఆరోపణలు చేయడం ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో వివాదాస్పదంగా మారారు. దీనితో జిల్లాలోని సహచర మంత్రి సీతక్క ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు చివరికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందరితోనూ వ్యతిరేక భావాన్ని మూట కట్టుకున్నారు. దీంతో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కొంత కాలం పాటు మంత్రిగా సజావుగానే సాగినా...గత కొంత కాలంగా మాత్రం అమెకు జిల్లా రాజకీయాల పరంగానే కాకుండా తన మంత్రిత్వ శాఖ పరిధిలో సొంత పార్టీ వారి నుంచే అడ్డంకులు ఎదురవుతూ వచ్చాయి. ఈ నేపధ్యంలోనే రెండుమార్లు నేరుగా సురేఖా కుమార్తె సిఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ బహిరంగంగా విమర్శలు చెయ్యడం సంచలనంగా మారింది. దీంతో మొదటి సారి మాట్లాడిన సందర్బంలో పరిస్ధితులు సర్దుకున్నా.... రెండవ మారు మాత్రం తెగే వరకు పరిస్ధితులు దారితీశాయి.
నా కుమార్తె వ్యాఖ్యలకు, నాకేంటీ సంబంధం అంటూ కొండా సురేఖ వాధిస్తూ వచ్చినా... పార్టీ రాష్ట్ర అధిష్టానం, కేంద్ర అదిష్టానం మాత్రం చాలా సీరియస్ గానే పరిగణించాయి. మంత్రి కొండా సురేఖా తన వాదనను అందరితో విన్నవించుకున్నా... చివరకు అమెను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేసే వరకు పరిస్ధితులు దారితీశాయి. ప్రత్యేకించి సిఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టి మరి కొండా సురేఖాను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసే వరకు పార్టీ పెద్దలతో వాదించారు. చివరకు అనుకున్నది రేవంత్ రెడ్డి నెరవేర్చుకోవడంతో కొండా సురేఖాను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేశారు. దీంతో అమె మరోమారు మాజీ మంత్రి అయ్యారు. ఈ సారి వెయ్యి రోజుల పాటు మంత్రిగా కొనసాగారు. మొదటి సారి 100 రోజులు... ఇప్పుడు మంత్రి అయ్యాకా 1000 రోజుల పాటు మంత్రిగా పని చేశారు.
మొత్తం మీద ఎమ్మెల్యే పదవి అయినా... మంత్రి పదవైనా ఎక్కడా అమె రాజీపడకుండా తాను నమ్ముకున్న సిద్దాంతానికి కట్టుబడి నడుచుకోవడం వల్లే అమె మంత్రి పదవి కోల్పోయేందుకు దారితీశాయి. మరి మంత్రి పదవి నుంచి భర్తరఫ్ అయిన కొండా సురేఖా దారి ఎటు... మరిప్పుడు మంత్రి అవుతుందొ ... కాంగ్రెస్ లో ఉంటారా లేక పార్టీ వీడతారా అన్నది మరి కొన్ని రోజులు వేచిచూడాల్సిందే.