కొలంబో :
టీ-20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో సునాయాస విజయం సాధించింది. అది కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముందు బ్యాటింగ్‌లోనూ, తర్వాత బౌలింగ్‌లోనూ మెరిసి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో టీమిండియా సూపర్-8కి క్వాలిఫై సాధించింది. టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ జరిగింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లు సమష్టిగా రాణించి పాక్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. పాక్ బ్యాటర్లలో ఉస్మాన్ (44) ఒంటరి పోరాటం చేశాడు.
ముందుగా టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్‌కు అనుకూలించిన స్లో పిచ్‌పై ఆరంభంలోనే టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77) మాత్రం పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పది ఫోర్లు, మూడు సిక్స్‌లతో పరుగుల వరద పారించాడు. అయుబ్ బౌలింగ్‌లో ఇషాన్ అవుటైన తర్వాత పరుగుల వేగం కాస్త నెమ్మదించింది. ఆ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32), తిలక్ వర్మ (25) ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. సూర్య మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో దూబె (27) వేగంగా ఆడాడు.
పాకిస్థాన్ పోరాటం
టీ20 ప్రపంచకప్‌లో తన చిరకాల ప్రత్యర్థి భారత్‌తో మ్యాచ్ గెలిచేందుకు మైదానంలోకి దిగిన పాకిస్థాన్ ఘోరంగా విఫలమైంది. పూర్తి ఓవర్లు ఆడకుండా 18 ఓవర్లకే మ్యాచ్‌ను ముగించేసింది. 176 లక్ష్యాన్ని సాధించడానికి తీవ్రంగా శ్రమించినా 114 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్లు దిగిన ఫర్హాన్, సైమ్‌కు తొలి ఓవర్‌లోనే భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచేందుకు ప్రయత్నించగా ఫర్హాన్ రింకూ సింగ్‌కు క్యాచ్‌తో దొరికాడు. పవర్‌ప్లేలో తొలి ఓవర్‌ను పాండ్యా మైడిన్ చేశాడు. తర్వాత సైమ్ ఆయూబ్ 6 పరుగులకే ఔటవగా.. కెప్టెన్ సల్మాన్ అలి అఘా నాలుగో పరుగులకే వెనుదిరగడంతో పాకిస్థాన్ కష్టాల్లో పడింది.
టపటపా పాక్ వికెట్లు :
భారత బౌలర్ల దెబ్బకు పాకిస్థాన్ టపటపా వికెట్లు కోల్పోయింది. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ కూడా ఐదు పరుగులే చేసి ఔటవగా.. ఉస్మాన్ ఖాన్ నిలబడ్డాడు. వికెట్లు పడుతున్న సమయంలో గ్రౌండ్‌లో పటిష్టంగా నిలబడి 34 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టుకు ఊపిరినిచ్చాడు. ఉస్మాన్‌కు చక్కటి సహకారం అందిస్తున్న షాదాబ్ ఖాన్ 14 పరుగులకు ఔటవడంతో.. మహ్మద్ నవాజ్ వచ్చి 4 పరుగులకే వెనుదిరిగాడు. ఓటమిని ఖరారు చేసుకున్న సమయంలో ఫాహిమ్ అశ్రఫ్ (10)తో కలిసి షాహీన్ అఫ్రిదీ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. 19 బంతుల్లో 23 పరుగులు చేసి ఓటమి అంతరాన్ని తగ్గించాడు. ఈ మ్యాచ్‌లో ముగ్గురు డకౌట్ కావడం గమనార్హం. 
హ్యాట్రిక్ విజయాన్ని అందించిన భారత్ బౌలర్లు :
బ్యాటర్లు విధించిన మోస్తరు లక్ష్యాన్ని భారత బౌలర్లు కాపాడి జట్టుకు హ్యాట్రిక్ విజయాన్ని అందించారు. హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ వేసి తొలి ఓవర్‌లోనే పాకిస్థాన్‌కు భారీ షాక్ ఇచ్చాడు. అనంతరం బరిలోకి దిగిన బుమ్రా రెండో ఓవర్‌లో వరుసగా రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్ భారత్ వైపు మళ్లింది. పొదుపుగా బంతులు వేస్తూ పాక్ బ్యాటర్లను వరుసగా బౌలర్లు దెబ్బతీశారు. పాండ్యా, బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా రెండేసి వికెట్లు తీశారు. ఈ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఆడిన కుల్దీప్ యాదవ్‌తోపాటు తిలక్ వర్మ ఒక్కో వికెట్ తీసి విజయంలో భాగమయ్యారు.